హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)/ వరంగల్ చౌరస్తా : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీ కోటా(కన్వీనర్ కోటా) ప్రవేశాలకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును కాళోజీ హెల్త్ వర్సిటీ సోమవారం విడుదల చేసింది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టుతోపాటు, ప్రవేశాలకు అనర్హులైన అభ్యర్థుల జాబితాను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్లో తమ వివరాలు, మెరిట్‌లిస్టులో తమ పేర్లు, అనర్హులు జాబితాలో తమ వివరాలు పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లేదా అనర్హుల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే బుధవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా సమర్పించాలని సూచించింది. ఫిర్యాదులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించిన అనంతరం అర్హులైన అభ్యర్థుల తుది మెరిట్ లిస్ట్, సీట్ల మ్యాట్రిక్స్, మొదటి విడత కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్లు నమోదు నోటిఫికేషన్ తదితర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రకటించనున్నారు. మార్గదర్శకాలు, నోటిఫికేషన్లకు వెబ్సైట్ www.knruhs.telan gana.gov.in క్రమం తప్పకుండా సందర్శించాలని వర్సిటీ కోరింది.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలయ్యిది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల్లోని సీట్ల భర్తీకి అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు కాలేజీల్లో దరఖాస్తు చేసుకోవాలని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య సూచించారు. వివరాలకు 80089 08304 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.