వరంగల్ : పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 25 నుండి 27 తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు కాళోజి హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ శనివారం మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చెసింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలకు అదే విధంగా నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో పొందుపరిచారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.