సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షికారు’. హరి కొలగాని దర్శకుడు. పి.ఎస్.ఆర్ కుమార్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. జనవరి 26 విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఐదుగురి జీవితాల చుట్టూ తిరిగే కథ ఇది. ఓ ప్రయాణం వారి జీవితాల్లో ఎలాంటి మార్పులను తీసుకొచ్చిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది’ అన్నారు. సాయిధన్సిక మాట్లాడుతూ ‘తెలుగులో నాకు మంచి పేరుతెచ్చిపెట్టే సినిమా అవుతుంది. నా కళ్లు చూసి దర్శకుడు కథానాయిక పాత్ర కోసం ఎంచుకున్నానన్నారు’ అని చెప్పింది. యువతరాన్ని మెప్పించే అన్ని హంగులుంటాయని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.రావు, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.