Chandrayaan -3 | చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండర్ విక్రమ్ దిగింది. భారత్ చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఓకే. కానీ జాబిల్లిపై సురక్షితంగా దిగిన తర్వాత ల్యాండర్, రోవర్లు ఏం చేస్తాయి ? ఎన్ని రోజులు పరిశోధనలు జరుపుతాయి ? వీటికి అవసరమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ? ఈ డౌట్లు అందరి మదిలో ఉండే ఉంటాయి కదా.. ఇదిగో వాటికి సమాధానాలు!
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చేరుకున్న తర్వాత ముందుగా ల్యాండర్ విక్రమ్ లోపలి నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. వాటికి ఉన్న ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుని 14 రోజుల పాటు వాటిలో ఉన్న 5 కీలకమైన పేలోడ్ల ఆధారంగా పరిశోధన చేస్తాయి. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది ? చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్లో ఎలాంటి రసాయనాలు, మూలకాలు ఉన్నాయి వంటి విషయాలను పేలోడ్లు పరిశోధించి ఆ సమాచారాన్ని భూమిమీదకు చేరవేస్తాయి. ఇందులో ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమిపైకి కమ్యూనికేట్ అవుతాయి. రోవర్ మాత్రం ల్యాండర్‌కు కమ్యూనికేట్ చేస్తుంది.
– విక్రమ్ ( Vikram ) ల్యాండర్లో మొత్తం మూడు పేలోడ్లు RAMBHA, ChaSTE, ILSA ఉన్నాయి. ఇందులో రాంబా ( రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటీవ్ ఐనోస్పిర్ అండ్ అట్మాస్పియర్) చంద్రుడి ఉపరితలంపై ఉన్న అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతపై అధ్యయనం చేస్తుంది.
– చాస్టే ( చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ ) అనే పేలోడ్ చంద్రుడిపైన ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది. ఐఎల్ఎస్ఏ మాత్రం చంద్రుడిపై పొరలు, మట్టి స్వభావాన్ని పరిశీలిస్తుంది.
ఇక ప్రగ్యాన్ ( Pragyan ) రోవర్లో రెండు పేలోడ్ LIBS, APXSలు ఉంటాయి. ఇందులో లిబ్స్ ( లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డైన్ స్పెక్ట్రోస్కోప్ )లో ఉన్న లేజర్ చంద్రుడిపై ఉన్న మట్టిపై పడుతుంది. ఆ లేజర్ లైట్ ద్వారానే చంద్రుడిపైన ఉన్న మట్టి కరుగుతుంది. అలా కరిగిన మట్టిలో ఎలాంటి రసాయన మూలకాలు, ఖనిజ సంపద ఉందో లిబ్స్ గుర్తిస్తుంది. రోవర్ దిగిన ప్రదేశంలోని మట్టి రాళ్లలో ఉన్న రసాయనాలను ఏపీఎక్స్ఎస్ ( ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్టోమీటర్ ) పేలోడ్ గుర్తిస్తుంది. చంద్రుడిపై ఉన్న మట్టి, రాళ్లలో మెగ్నీషియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, అల్యూమినియం వంటి మూలకాలను గుర్తిస్తుంది.
చంద్రుడిపై ఒక్క పగలు మనకు 14 రోజులతో సమానం. చంద్రుడిపై సూర్యరశ్మి ఉన్నంతసేపే విక్రమ్, ప్రగ్యాన్‌లు సక్రమంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఈ రెండింటిపైన ఉన్న సోలార్ ప్యానెల్ల ద్వారానే వీటికి శక్తి అందుతుంది. చంద్రుడిపై సూర్యాస్తమయం అయితే మైనస్ 180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కాబట్టి ల్యాండర్, రోవర్లకు శక్తి అందదు. అలాంటి పరిస్థితుల్లో వాటిలోని వ్వవస్థలు సక్రమంగా పనిచేయవు. అందుకే వీటి జీవిత కాలం 14 రోజులే.