‘అలనాడు బృందావన విహారి శ్రీకృష్ణుడు గోపికలతో జరిపిన ప్రేమాయణం రసరమ్య ప్రణయగాథగా వినుతికెక్కింది. మరి నేటి అభినవ కృష్ణుడి ప్రేమ పయనం ఎలాంటి అనుభూతులతో సాగిందో తెలుసుకోవాలంటే ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాలో చూడాల్సిందే’ అని అంటున్నారు అనీష్ ఆర్ కృష్ణ. ఆయన దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లీసెటియా జంటగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఉషా ముల్పూరి నిర్మాత. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. నాగశౌర్య పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. వైవిధ్యమైన కథాంశంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: మహతిస్వరసాగర్, నిర్మాణ సంస్థ: ఐరా క్రియేషన్స్, సమర్పకులు: శంకర్‌ప్రసాద్ ముల్పూరి, దర్శకుడు: అనీష్ ఆర్ కృష్ణ.