Vijay Sethupathi | తమిళనాడులో ప్రముఖ సినీ నటుడు, బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇవ్వడం, సమస్యల నుంచి పారిపోయేందుకు ప్రతిపక్షాన్ని నిందించడం నాయకుడి లక్షణం కాదు అంటూ బిగ్ బాస్ వేదికపై ఆయన చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
షోలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత, సీఎం విజయ్ను ఉద్దేశించే చేశారని ఆ పార్టీ శ్రేణులు మరియు విజయ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో పెరుగుతున్న వివాదంపై స్పందించిన విజయ్ టీవీ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బిగ్ బాస్ తమిళ సీజన్ 10 కార్యక్రమం కేవలం వినోదం కోసం మాత్రమేనని, అందులో జరిగే సంభాషణలను బయటి వ్యక్తులతో ముడిపెట్టవద్దని స్పష్టం చేసింది.
“బిగ్ బాస్ అనేది పూర్తిగా వినోదాత్మక కార్యక్రమం. ఇందులో ప్రసారమయ్యే అభిప్రాయాలు, సంభాషణలు కేవలం ఆ షో పరిధికి మాత్రమే పరిమితం. వాటిని షో వెలుపల ఉన్న ఏ వ్యక్తి, సంస్థ లేదా రాజకీయ విధానాలతోనూ ముడిపెట్టడం సరికాదు” అని ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా, కార్యక్రమంలో వచ్చే సంభాషణలను ఎవరూ వ్యక్తిగత విమర్శలుగా లేదా సమర్థనలుగా భావించరాదని ఛానెల్ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం కోలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.