Anil Ravipudi | టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి అధికారికంగా శ్రీకారం చుట్టుకుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు విచ్చేసి సందడి చేశారు. ఇక ఈ సినిమాలో నటించబోయే కథానాయికలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్లో వెంకీ మామకు జోడీగా నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ నటిస్తోండగా.. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి సందడి చేయనుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ (Zee Studios) సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం వహిస్తున్నాయి. అనిల్ రావిపూడికి బాగా కలిసివచ్చిన సంక్రాంతి సీజన్‌నే ఈ సినిమాకు కూడా లాక్ చేశారు. 2027 సంక్రాంతి కానుకగా ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దగ్గుబాటి మరియు నందమూరి వంశాల హీరోలు కలిసి నటిస్తుండటంతో, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్పై అటు అభిమానుల్లో, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.