Bluetooth : ఒక బ్లూటూత్ పేరు (Bluetooth name) విమానంలోని సిబ్బందిని కంగారు పెట్టింది. దాంతో ఏకంగా ఎమర్జెన్సీ ప్రకటించి, విమానాన్ని యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా స్పెయిన్ (Spain) కు వెళ్లాల్సిన విమానం అమెరికాలోనే తిరిగి ల్యాండ్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. యునైటెడ్ ఎయిర్లైన్స్ (United Airlines) కు చెందిన బోయింగ్ విమానం.. 190 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో న్యూజెర్సీ (New Jersey) లోని నెవార్క్ (Nework) నుంచి స్పెయిన్కు బయల్దేరింది.
కొద్దిసేపటికి సిబ్బంది ఓ విషయాన్ని గుర్తించారు. ఒక బ్లూటూత్ డివైజ్ పేరు ‘బాంబ్’ అని ఉండటాన్ని గమనించారు. ప్రయాణికులంతా తమ ఫోన్లలోని బ్లూటూత్ ఆపేయాలని సూచించారు. అలా పదేపదే సూచనలు చేసినా.. ఈ బాంబ్ పేరుతో ఉన్న డివైజ్ మాత్రం యాక్టివ్గానే చూపించింది. రెండు గంటలు అయినా అది అలాగే ఉండటంతో గ్రౌండ్ సిబ్బందితో సమన్వయం చేసుకొని ఎమర్జెన్సీ ప్రకటించారు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి నెవార్క్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. శనివారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా పోస్టుల కారణంగా వెలుగులోకి వచ్చింది.