శీతాకాలంలో మక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు విషపు ఎర తయారు చేసుకోవాలి. ఇందుకోసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిలో 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లం కలిపి 24 గంటల పాటు పులియనివ్వాలి. మరుసటి రోజు ఈ మిశ్రమానికి 100గ్రా. థయోడికార్బ్ కలుపుకొని, చిన్న చిన్న ఉండలుగా చేయాలి. వీటిని మొక్క సుడులలో వేసుకోవాలి. లీటర్ నీటిలో 0.4 గ్రా. ఎమామెక్టిన్ బెంజోయేట్ లేదా థయోమిథాక్సామ్ 9.5% +లామ్డా సైహలోత్రిన్ 12.6% 0.5 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
మక్కజొన్న పైరు మొలిచిన 10 నుంచి 15 రోజుల మధ్య మొవ్వు పురుగు ఆశించే అవకాశాలున్నాయి. దీని నివారణకు లీటర్ నీటిలో 2.0 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. పైరు 25 నుంచి 30 రోజుల దశలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోల చొప్పున మొవ్వులో వేయాలి.
మిరపలో తామర పురుగులు, నల్లి ఉధృతి గమనిస్తే, లీటర్ నీటిలో 1.5 గ్రా. డైఫెన్ థయురాన్ లేదా 2 మి.లీ. క్లోర్ఫిన్ఫార్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఈ సమయంలో గుండుపూత ఈగ ఆశించడానికి అవకాశం ఉంటుంది. నివారణ కోసం లీటర్ నీటిలో 1.5 మి.లీ. ట్రైజోఫాన్ లేదా 25 మి.లీ. క్లోర్పైరిఫాస్ కలిపి పిచికారీ చేయాలి. మిరపలో ఫ్యుజేరియం ఎండు తెగులు సోకే సూచనలున్నాయి. నివారణ కోసం లీటర్ నీటిలో 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1గ్రా. కార్బెండజిమ్ కలిపి మొక్క మొదళ్ల దగ్గర నేల తడిసేలా పిచికారీ చేయాలి. చలికాలంలో కూరగాయల పంటల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నది. వీటి నివారణకు లీటర్ నీటిలో 2 మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.3గ్రా థయోమిథాక్సామ్ కలిపి పిచికారీ చేయాలి.
తీగజాతి పంటలైన సొర, కాకర, బీరకాయ చేలలో పండు ఈగ ఉధృతి కనిపిస్తే, ఎకరానికి నాలుగు నుంచి ఐదు లింగాకర్షక బుట్టలను (క్యూ లూర్) అమర్చుకోవాలి.
టమాటలో ఆకుమాడు తెగులు సోకేందుకు ఈ వాతావరణం అనుకూలం. ఈ తెగులు నివారణకు లీటర్ నీటికి 25 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1 మి.లీ. ప్రోపికొనజోల్ కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ఆలస్యంగా నాటిన టమాట పైరులో శనగ పచ్చ పురుగు ఆశించే అవకాశం ఉన్నది. దీని నివారణ కోసం లీటర్ నీటిలో 1.25 మి.లీ. నొవాల్యూరాన్ కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తామర పురుగులు కనిపిస్తే, లీటర్ నీటిలో 2 మి.లీ. డైమిథోయేట్ మందును కలిపి పిచికారీ చేయాలి.