కొందరి నిర్లక్ష్యం.. మరికొందరి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నది. బీడీ, సిగరెట్ తాగి దాన్ని ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేస్తున్న వారి కారణంగానే ఎక్కువ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని అగ్నిమాపకశాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఏడాది జరిగిన మొత్తం ప్రమాదాల్లో ఈ తరహాలో 38.52 శాతం ఘటనలు నమోదయ్యాయని తెలిపింది. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా తెలంగాణ అగ్నిమాపకశాఖ అధికారులు 2020, 2021లో నమోదైన అగ్నిప్రమాదాలు, కారణాలు, వాటి తీవ్రత, ప్రాణ, ఆస్తి నష్టాలపై వివరాలు వెల్లడించారు. వాటి ప్రకారం.. చాలా ప్రమాదాలు ప్రజల్లో అవగాహన లేమి కారణంగానే జరుగుతున్నట్టు తేలింది. అగ్నిప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ వారం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు అగ్నిమాపకశాఖ సన్నద్ధమైంది.