దక్షిణాది సినీరంగంపై అగ్ర కథానాయిక తమన్నా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దక్షిణాది సినిమాల్లో పురుషాధిక్యత ఎక్కువగా కనిపిస్తుందని, కథానాయికల్ని గ్లామరస్‌గా చూపించడానికే అధిక ప్రాధాన్యతనిస్తారని తమన్నా వ్యాఖ్యానించింది. ‘హిందీ చిత్రసీమలో రెండు రకాల నటులుంటారు. కొందరు అభినయప్రధాన పాత్రల్ని ఎంచుకొని కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటారు.
మరికొందరేమో కేవలం గ్లామర్‌కే పరిమితమవుతారు. బాలీవుడ్లో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. కానీ దక్షిణాదిలో మాత్రం నటన, గ్లామర్‌ను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది’ అని తమన్నా పేర్కొన్నది. ఆమె మాటలపై దక్షిణాది అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తెలుగు, తమిళం ద్వారానే స్టార్‌డమ్‌ను సంపాదించుకొని విశ్వాసం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.