సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపుతోంది. ఇంతకు ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొక్కుబడిగా చేపడతారన్న ఆరోపణలు ఉండేవి. తాజాగా హెచ్ఎండీఏ వారం రోజులుగా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో అక్రమ నిర్మాణదారుల్లో ఒక రకమైన భయం ఏర్పడింది. అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేపడితే కూల్చివేస్తారన్న విషయం చాలా మందికి అర్థమైంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మునిసిపల్ చట్టం-2019 ప్రకారం, అక్రమ నిర్మాణాలపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో పాటు జిల్లా స్థాయిలోనే ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ ట్కాస్క్పోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. వీటిని సమర్థవంతంగా పనిచేయించడంపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా వాటిని అడ్డుకునే విధంగా నిబంధనలను అమలు చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వానికే నష్టం..
కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి చోట చాలా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు హెచ్ఎండీఏ గుర్తించింది. ఇందుకు ప్రత్యేక ఉదాహరణ మేడ్చల్ జోన్ పరిధిలోని బాచుపల్లి మల్లాపూర్ ప్రాంతంలో సర్వే 170/3, 170/4, 170/5లో శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ అనే సంస్థ గత నాలుగైదు ఏళ్ల క్రితం సుమారు 60 డూప్లెక్స్ విల్లాలకు హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందింది. దీనిని అడ్డం పెట్టుకొని నిర్వహణ సంస్థ కాలం చెల్లిన గ్రామ పంచాయతి అనుమతులను చూపిస్తూ 260 విల్లాలను నిర్మించింది. దీంతో వీటిని కొనుగోలు చేసిన, వారు హెచ్ఎండీఏ కోట్లలోనే నష్టం వాటిల్లింది. ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ఇక నుంచి పుల్ స్టాప్ పెట్టేలా పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం ఏడు జిల్లాలు, 70 మండలాలు ఉండగా, 40 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, 719 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
వీటి పరిధిలో ఎక్కడ నిర్మాణాలు జరిగినా వాటిని గుర్తించే జిల్లా స్థాయిలో తనిఖీలు చేపట్టి, చర్యలు తీసుకునేలా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతలు అవే కోవకే చెందుతాయని, మున్ముందు అక్రమ నిర్మాణాలకు ఆస్కారం ఉండదని హెచ్ఎండీఏ అధికారులు పేర్కొంటున్నారు. టీఎస్ బీ పాస్ నుంచి తీసుకున్న అనుమతినే ప్రామాణికంగా తీసుకొని, పాత తేదీల అనుమతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే వాటిని కూల్చివేసేలా చట్టం కూడా ఉందన్నారు.