ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతున్నది.
ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్‌లలో ఒకటిగా వెలుగొందుతున్న ఐపీఎల్ 15వ సీజన్‌కు సమయం ఆసన్నమైంది. వారం రోజుల వ్యవధిలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో పరిమిత వేదికల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య లీగ్ జరుగనుంది.
గత సీజన్లకు భిన్నంగా పది జట్ల సమాహారంతో కప్ వేట మొదలుకానుంది. పాత ఎనిమిది జట్లకు లక్నోసూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ రూపంలో రెండు కొత్తగా వచ్చి చేరాయి. లీగ్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈసారి నయా జోష్‌తో బరిలోకి దిగుతున్న లక్నో, గుజరాత్ మెరుపులు మెరిపించేందుకు తహతహలాడుతున్నాయి.
లీగ్‌లో కొత్త జట్లయినా.. స్టార్ ఆటగాళ్ల మేళవింపుతో తామేం తీసిపోమని నిరూపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో, గుజరాత్ జట్లపై మనం ఒక లుక్కెద్దాం పదండి.
టైటాన్స్ మెరిసేనా: సీవీసీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ పేరుకు తగ్గట్టే మెరుపులు మెరిపించేందుకు ఉవ్విళ్లూరుతున్నది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో లీగ్‌లో అడుగుపెడుతున్న గుజరాత్‌కు మాజీ క్రికెటర్ అశిష్ నెహ్రా చీఫ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా, దక్షిణాఫ్రికా గ్రేట్ గ్యారీ కిర్‌స్టెన్ మెంటార్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో వీరిద్దరి అనుభవం జట్టుకు ఎలా ఉపయోగపడుతుందనేది చూడాలి. ఫామ్‌లేమికి తోడు ఫిట్నెస్ పరంగా ఇన్ని రోజులు సమస్యలు ఎదుర్కొని తాజాగా యో-యో పరీక్షలో పాసైన హార్దిక్‌కు నాయకత్వ బాధ్యతలు కొత్త కాగా, ఏ రకంగా జట్టును ముందుకు నడిపిస్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. హార్దిక్‌తో పాటు ఆఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్, యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను అట్టిపెట్టుకున్న టైటాన్స్ వేలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చెప్పుకోదగ్గ బ్యాటర్ లేకపోవడం జట్టులో వెలితిగా కనిపిస్తున్నది. గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా ఆ తర్వాత వరుసలో ఎవరు వస్తారనేది చూడాలి.
బలం:
కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు ఆయువుపట్టుగా కనిపిస్తున్నాడు. లీగ్‌లో ఇంతకుముందు నాయకత్వం వహించిన అనుభవం లేకపోయినా..ధోనీ, కోహ్లీ, రోహిత్‌శర్మతో కలిసి ఆడటం హార్దిక్‌కు కలిసిరానుంది. ఫామ్‌లేమితో పాటు ఫిట్నెస్ సమస్యల నుంచి బయటపడ్డ హార్దిక్ అటు కెప్టెన్సీతో పాటు ఆల్‌రౌండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తే జట్టుకు ప్రయోజనం చేకూరనుంది. హార్దిక్‌కు తోడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ జట్టుకు అదనపు బలం. మిడిలార్డర్లో బ్యాటింగ్‌తో పాటు ఉపయుక్తమైన పేస్ బౌలింగ్‌తో శంకర్ రాణిస్తే జట్టుకు లాభించవచ్చు. బౌలింగ్‌కు షమీ చుక్కానిలా కనిపిస్తుండగా, ఫెర్గుసన్, అల్జారీ జోసెఫ్ జత కలిస్తే ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు.
బలహీనత:
ఓపెనింగ్‌లో గిల్ మినహా జట్టుకు చెప్పుకోదగ్గ బ్యాటర్ కనిపించడం లేదు. బయోబబుల్ కారణాలతో ఇంగ్లండ్ హార్డ్‌హిట్టర్ జాసన్ రాయ్ ఆదిలోనే హ్యాండ్ ఇవ్వడం జట్టు కూర్పును దెబ్బతీసింది. రాయ్ స్థానంలో ఆఫ్గన్ వికెట్‌కీపర్, బ్యాటర్ రెహమనుల్లా గుర్బాజ్‌ను తీసుకున్నా..ఏ మేరకు రాణిస్తాడనేది సందేహమే. బౌలింగ్ విషయానికొస్తే షమీ, ఫెర్గుసన్, జోసెఫ్ మినహా చెప్పుకోదగ్గ పేసర్ కనిపించడం లేదు. వీరిలో ఎవరు గాయపడ్డ జట్టుకు ఎదురుదెబ్బే. స్పిన్ దళానికి రషీద్‌ఖాన్ నాయకత్వం వహిస్తుండగా, రాహుల్ తెవాటియా, జయంత్ యాదవ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్నది ఆసక్తికరం. మొత్తంగా హార్దిక్, నెహ్రా కాంబినేషన్ కలిసివస్తుందా అన్నది లీగ్ జరుగుతున్న కొద్ది తెలియనుంది.
సూపర్ అనిపించేనా: ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీ సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని లక్నో జట్టు కొత్త, పాతల కలయికగా కనిపిస్తున్నది. లీగ్ కొత్తగా కనిపిస్తున్నా..గోయెంకాకు చెందిన రైజింగ్సూపర్ జెయింట్స్ 2016, 17లో ప్రాతినిధ్యం వహించింది. జట్టు విషయానికొస్తే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సారథ్యంలో లక్నో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. గత కొన్ని సీజన్లుగా పంజాబ్ కింగ్స్‌ను ముందుండి నడిపించిన రాహుల్‌కు నాయకత్వం కొత్త కాకపోయినా..వేలంలో ఆటగాళ్ల ఎంపిక ఆసక్తికరంగా సాగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్..లక్నోకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. తనకున్న అనుభవంతో లక్నో విజయాల్లో కీలక భూమిక పోషించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో వేలంలో ఆటగాళ్ల ఎంపిక విషయంలోనూ గంభీర్ తనదైన ముద్ర వేశాడు. రాహుల్‌తో పాటు యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను అట్టిపెట్టుకున్న సూపర్‌జెయింట్స్..వేలంలో యువకులతో పాటు విదేశీ స్టార్ ఆటగాళ్లను కైవసం చేసుకుంది. ఇందులో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున గత సీజన్లో మెరుపులు మెరిపించిన ఇండోర్ ఎక్స్‌ప్రెస్ అవెశ్ఖాన్తో పాటు దీపక్ హుడా, మనీశ్ పాండే, కృష్ణప్ప గౌతమ్, కృనాల పాండ్యా లాంటి ప్రతిభ కల్గిన క్రికెటర్లు ఉన్నారు. వీరితో పాటు సఫారీ స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్, విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్, మార్క్ వుడ్, ఎవిన్ లెవిస్ తమదైన రోజున మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో ముందుంటారు.
బలం: కొత్త జట్టుగా బరిలోకి దిగుతున్న లక్నో జట్టుకు కెప్టెన్ రాహుల్ ప్రధాన బలం కాగా, స్టోయినిస్, హోల్డర్, మనీశ్ పాండే, డికాక్, బిష్ణోయ్ రూపంలో మేలిమి క్రికెటర్లు ఉన్నారు. వీరు గనుక స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ప్రత్యర్థికి దీటైన పోటీనివ్వడం ఖాయం. రాహుల్, డికాక్ లాంటి డాషింగ్ బ్యాటర్లు లక్నోకు లాభించే అంశం. వీరిద్దరిలో ఏ ఒక్కరు కుదురుకున్న జట్టు భారీ స్కోరు అందుకోవడం ఖాయం. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించే రాహుల్ కట్టడి చేయడంపై లక్నో విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇదిలా ఉంటే బౌలింగ్‌లో అవేశ్‌ఖాన్, అంకిత్, చమీరా, హోల్డర్ రూపంలో పేస్ బౌలింగ్ దళం పటిష్ఠంగా కనిపిస్తున్నది. బిష్ణోయ్, నదీమ్, స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు.
బలహీనత:
లక్నో జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొన్నది. పేపర్ చూస్తే బలంగా కనిపిస్తునా..బరిలోకి దిగిన తర్వాత అసలు సంగతి ఏంటో తెలియనుంది. రాహుల్, డికాక్ శుభారంభంపై జట్టు గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు సాధించినా..నిలబెట్టుకోవడంలో లక్నో సఫలమవుతుందా అనేది అసలు ప్రశ్న.
జట్టు వివరాలు: హార్దిక్(కెప్టెన్), గిల్, రషీద్‌ఖాన్, షమీ, ఫెర్గుసన్, అభినవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, డ్రేక్స్, జయంత్ యాదవ్, విజయ్ శంకర్, దర్శన్ నలకందే, యశ్ దయాల్, జోసెఫ్, సాంగ్వాన్, మిల్లర్, సాహా, వేడ్, గురుకీరత్‌సింగ్.
జట్టు వివరాలు: రాహుల్ (కెప్టెన్), స్టోయినిస్, బిష్ణోయ్, డికాక్, మనీశ్ పాండే, హోల్డర్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, వుడ్, అవేశ్‌ఖాన్, అంకిత్ రాజ్‌పుత్, గౌతమ్, చమీరా, నదీమ్, వోహ్రా, మోహిసిన్ ఖాన్, బదోనీ, మేయర్స్, కర్ణ్‌శర్మ, లెవిస్, మయాంక్ యాదవ్