కూలిడ్జ్ (అంటిగ్వా) : వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ (11 బంతుల్లో 38; 6 సిక్సర్లు) ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో చరిత్రకెక్కాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా, టీ20ల్లో భారత స్టార్ యువరాజ్ సింగ్ తర్వాత రెండో ప్లేయర్‌గా పొలార్డ్ నిలిచాడు. దీంతో గురువారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో లంకపై వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేస్తే.. పొలార్డ్ విజృంభణతో లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 13.1 ఓవర్లలోనే ఆరు వికెట్లకు 134 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన స్పిన్నర్ ధనంజయ వరుస బంతుల్లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ లూయిస్ (28), గేల్ (0), పూరన్ (0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆ తరుణంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్.. ధనంజయ వేసిన తర్వాతి ఓవర్లో ఊచకోత కోశాడు. బిగ్ హిట్టింగ్తో బంతిని బౌండరీలు దాటిస్తూ సిక్సర్ల మోత మోగించాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. పొలార్డ్ దెబ్బకు లక్ష్యం కరిగిపోయింది. ఆ తర్వాత అతడు ఔటైనా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ పని సులువైంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. పాతుమ్ నిసనక (39), నిరోషన్ డిక్వెలా (33) మాత్రమే మోస్తరుగా రాణించారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో యువరాజ్ ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. కాగా అంతర్జాతీయ వన్డేల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు (నెదర్లాండ్‌పై) కొట్టిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ హర్షెల్ గిబ్స్ పేరిట ఉంది.