ముంబై, డిసెంబర్ 23: పదమూడేండ్ల స్నేహితురాలు, దూరపు బంధువు అయిన అమ్మాయిపై లైంగికదాడి జరిపిన 20 ఏండ్ల యువకుడికి ముంబై పోక్సో కోర్టు జడ్జి ప్రీతికుమార్ ఘూలే పదేండ్ల జైలుశిక్ష విధించారు. ఈ సందర్భంగా ఆమె నేరస్థుని వైఖరిని తప్పుపట్టారు. ఓ అబ్బాయితో ఓ అమ్మాయి స్నేహం చేస్తున్నదంటే ఆమె లైంగిక సుఖం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎలా భావిస్తారని ప్రశ్నించారు. క్షణికమైన సుఖం కోసం అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా పిన్నవయసులో తన జీవితాన్ని కూడా దెబ్బతీసుకున్నాడని వ్యాఖ్యానించారు. నిందితునికి విధించిన శిక్ష అతడి వయసువారికి గుణపాఠం కావాలని అన్నారు. కోరిక తీర్చుకోవాలనే ఆతృత భవిష్యత్తును, కెరీర్ను, బంగారు ప్రగతికి బాటలు వేసుకోవాల్సిన దశను బూడిద చేస్తుందని జడ్జి ఆవేదన వ్యక్తంచేశారు. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా యవ్వనపు తొలినాళ్లలోనే భవిష్య ప్రగతికి పునాదులు పడతాయని అన్నారు.
ప్రస్తుత సందర్భంలో లైంగికదాడి అనే చర్య వల్ల నిందితునితో పాటుగా బాధితురాలి జీవితం చీకటిపాలైందని తెలిపారు. అమ్మాయి వివాహం రద్దు కావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విపరిణామాలను నిందితుడు అర్థం చేసుకున్నందున ముందుముందు మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశాలు లేవనే ఉద్దేశంతో గరిష్ఠశిక్ష విధించడం లేదని పేర్కొన్నారు. బాధితురాలికి జిల్లా న్యాయసేవా సంస్థ పథకాల కింద పరిహారం కల్పించాలని ఆదేశించారు.