వాషింగ్టన్: హెచ్1-బీ వీసా(H-1B Visas) ప్రోగ్రామ్‌ను మూడేళ్ల పాటు నిలిపివేయాలని రిపబ్లికన్ నేతలు అమెరికా కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్1బీ వీసాల జారీ వల్ల విదేశీ కార్మికులు చౌకగా దొరుకుతున్నారని, దీని వల్ల అమెరికా వర్కర్లకు ఉద్యోగాలు కరువు అవుతున్నట్లు ఆ బిల్లులో తెలిపారు. ఆరిజోనాకు చెందిన రిపబ్లికన్ నేత ఎలీ క్రేన్ .. 2026 హెచ్1బీ వీసా యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఆయనకు మద్దతుగా మరో ఏడు మంది రిపబ్లికన్ నేతలు బిల్లును సమర్ధించారు. హెచ్1బీ ప్రోగ్రామ్‌లో సంస్కరణలు చేపట్టాలని బిల్లులో ప్రతిపాదించారు. ఏడాదిలో కనీస వేతనం రెండు లక్షల డాలర్లు ఉండాలని డిమాండ్ చేశారు. హెచ్1బీ వీసాదారులు తమ కుటుంబీకులను అమెరికాకు తీసుకురావద్దు అన్న నియమాన్ని విధించారు.
బిల్లు కోస్పాన్సర్లుగా బ్రియాన్ బాబిన్, బ్రాండన్ గిల్, వెస్లే హంట్, కీత్ సెల్ఫ్, ఆండీ ఓగ్లెస్, పౌల్ గోసర్, టామ్ మెక్‌క్లింటాక్ సంతకాలు చేశారు. విదేశీ వర్కర్ల కోసం అమెరికా కంపెనీలు ఎక్కువగా హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంటాయి. ఈ వీసాలను వినియోగిస్తున్న వారిలో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉంటారు. లాటరీ సిస్టమ్‌కు బదులుగా వేతనం ఆధారంగా ఎంపిక జరగాలని కొత్త బిల్లులో కోరారు. అర్హత కలిగిన ఉద్యోగులు దొరకడం లేదని కంపెనీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. హెచ్1బీ వర్కర్లకు మల్టీపుల్ జాబ్స్ చేసే అవకాశం ఇవ్వవొద్దు అని బిల్లులో ప్రతిపాదించారు.