ఎస్బీఐ కార్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను పరిచయం చేసింది. ఎస్బీఐ యోనోపై ఇవి అందుబాటులో ఉంటాయి. కావాలనుకునే ఖాతాదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వీటిలో ఎలైట్, ప్రైమ్, సింప్లీక్లిక్, సింప్లీసేవ్ అనే నాలుగు రకాల కార్డులున్నాయి. అయితే ఎలైట్, ప్రైమ్ కార్డులు ప్రీమియం కార్డ్ ఆప్షన్లుగా ఉన్నాయి. అలాగే ఆన్లైన్ షాపింగ్ ప్రయోజనాలను కొరుకునేవారి కోసం సింప్లీక్లిక్, రోజువారి ఖర్చులు-ఆదా ప్రయోజనాల కోసం సింప్లీసేవ్ కార్డులను రూపొందించారు.
పొందడం ఎలా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఎఫ్డీ ఖాతా ఉన్నవారు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఈ సెక్యూర్డ్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తిగా పేపర్‌లెస్ అప్లికేషన్ ఇది. అంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. ఇక మీరు తీసుకునే క్రెడిట్ కార్డుకు సెక్యూరిటీగా మీ ఎఫ్డీ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుకు ఇది పూర్తిగా భిన్నం. సంప్రదాయ క్రెడిట్ కార్డులను బ్యాంకులు.. ఆయా కస్టమర్ల క్రెడిట్ స్కోర్, ఆదాయం, రుణ చెల్లింపుల చరిత్ర, ఇతరత్రా అర్హతల ఆధారంగా ఇస్తాయి. అయితే ఈ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుల మంజూరుకు ఇందులో దేన్ని కూడా బ్యాంకులు చూడవు. మీరు చేసే ఎఫ్‌డీనే హామీగా మీకు ఈ క్రెడిట్ కార్డ్ వస్తుంది మరి. అయితే మీ ఎఫ్డీ ఆధారంగానే క్రెడిట్ కార్డ్ ఖర్చుల పరిమితి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ లేనివారికి ఇది చాలా ప్రయోజనకరం.