ఫ్యాషన్ డిజైనింగ్, మాడలింగ్.. ఒకటేమిటి, కోరుకున్న శిఖరాలన్నీ చేరుకున్నారు సంధ్య జెల్లా. తన అనుభవానికి, అపార నైపుణ్యానికి చిటికెడు సృజన జోడించి గ్రూమింగ్ రంగంలోప్రవేశించారు. విద్యార్థినులను ప్రొఫెషనల్స్‌గా, గృహిణులను ఆంత్రప్రెన్యూర్స్గాతీర్చిదిద్దారు. స్వాప్నికుల కార్ఖానా ‘షీ గ్రూమింగ్’ ఫౌండర్ సంధ్య స్టార్టప్ స్టోరీ ఈ వారం..
ఏ రంగంలోనైనా ఒడుదొడుకులు సహజం. నేను కూడా ఫ్యాషన్ డిజైనర్‌గా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. అవాంతరాలకు తట్టుకుని నిలబడినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాం. లక్ష్యంపై ఫోకస్ చేసినప్పుడే గమ్యాన్ని ముద్దాడగలం. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలకు.. నమ్మకమే సగం బలం.
Sandhya Jella | నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. సొంత కాళ్లపై నిలబడాలనే సంకల్పంతో ఈ స్థాయికి వచ్చాను. పాఠశాల దశలోనే ఒంటబట్టిన ఫ్యాషన్ డిజైనింగ్ స్కిల్స్ నలుగురిలో ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. జీవితంలో ఎదురైన అనేకానేక సంఘటనలు నన్ను మరింత శక్తి మంతురాలిగా మార్చాయి. నాన్న ఏరోనాటికల్ ఇంజినీర్. సరిపడా పాకెట్ మనీ ఇచ్చేవారు. కానీ, సొంతంగా సంపాదించుకోవడంలోనే సంతృప్తి ఉందనిపించేది నాకు. దీంతో ఎంబీయే తర్వాత.. నాన్న నా పెళ్లి కోసం దాచిన డబ్బుతో ‘శైవీ’ పేరిట ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడియో ప్రారంభించాను. కస్టమర్స్‌కు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కూకట్‌పల్లిలోని ఓ మాల్లో షోరూమ్ అద్దెకు తీసుకున్నాను. వ్యాపారం వేగంగా పుంజుకుంది. ఒకప్పుడు హేళన చేసినవారే నన్ను ‘సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్’గా చూస్తున్నారు. ప్రశంసిస్తున్నారు.
ఆహార్యం వ్యక్తిత్వాన్ని చాటుతుంది. ప్రపంచానికి మనమేమిటో చెబుతుంది. ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్నరోజుల్లో.. అనుకోకుండానే ఓ ఈవెంట్ నిర్వహించాల్సిన బాధ్యత నా నెత్తిన పడింది. అప్పుడు, నా బుర్రలో మెరిసిన ఆలోచనే మాడలింగ్ వైపు అడుగులు వేయించింది. నన్ను నేను మాడల్‌గా తీర్చిదిద్దుకున్నాను. ‘ఇంప్రెస్ యూనివర్స్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ‘మిస్ యూనివర్స్’గా నిలిచాను. అక్కడితో
ఆగకుండా.. ‘మిస్ గ్లోబల్ ఇండియా’ పోటీలో పాల్గొనే స్థాయికి చేరుకున్నాను. ప్రతి మజిలీ కొండంత ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. నాలోని ప్రత్యేకతలు నాకు తెలిసేలా చేసింది. బాలిలో జరిగిన మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ పోటీలో ఏడో ఫైనలిస్ట్‌గా నిలబడటం ఆ ఆత్మవిశ్వాస ప్రభావమే.
ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్నప్పుడు, రెండు స్టోర్ట్స్ ప్రారంభించాను. అక్కడితో ఆగకుండా.. ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ‘షీ గ్రూమింగ్’ వెంచర్ ఆరంభించాను. సగటు మహిళను దృష్టిలోపెట్టుకుని డిజైన్ చేసిన వినూత్నమైన ప్రాజెక్ట్ ఇది. కుప్పలు తెప్పలుగా వస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థలు, మాడలింగ్ కన్సల్టెన్సీలకు భిన్నంగా దీన్ని తీర్చిదిద్దాను. సాధారణ స్త్రీని సైతం.. అందం, ఆత్మవిశ్వాసానికి ప్రతినిధిగా నిలబెట్టాలనేది నా లక్ష్యం. ఫ్యాషన్ డిజైనింగ్‌తోపాటు, ఆంత్రప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, అలంకరణ, మాటతీరు, సెల్ఫ్ డిఫెన్స్ నైపుణ్యాలు అందిస్తూ .. పరిపూర్ణ మహిళగా సానబడతాం. రెండేండ్ల కాలంలో రెండువేల మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాం. గ్రూమింగ్ రంగానికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. లక్షలు పోస్తే కానీ ఆ సంస్థల్లో శిక్షణ తీసుకోలేరు.
మా దగ్గర సగటు మహిళలకు కూడా ద్వారాలు తెరిచే ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రూమింగ్ కరికులమ్ సిద్ధం చేశాను. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ పట్టభద్రులు కాలేజ్ క్యాంపస్ నుంచి కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు కావాల్సిన భాషా నైపుణ్యాలు, ఆహార్యం, అలంకరణపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. ఫిట్నెస్ పాఠాలూ చెబుతాం. సామాజిక బాధ్యతగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్స్ (కోవె) తరఫున అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. ‘వాల్యూ ఎడ్యుకేషన్’ అనే ఎన్జీవో రాయబారిగా నిరుపేద బాలికలకు గ్రూమింగ్ గురించి అవగాహన కల్పిస్తున్నా. ఆత్మవిశ్వాసం నింపుతున్నా. ఆర్థిక స్వేచ్ఛ అవసరాన్ని నొక్కి చెబుతున్నా. తన కాళ్ల మీద తాను నిలబడినప్పుడే.. మహిళ సగర్వంగా తలెత్తుకోగలదు. నన్ను కలిసిన ప్రతి యువతికి నేను ఇచ్చే సలహా కూడా ఇదే. ఏ దశలోనూ నిరాశపడవద్దు. ఏ పరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకోవద్దు.
– కడార్ల కిరణ్
– చిన్న యాదగిరిగౌడ్