అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 16న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. “రణబాలి’ నెవర్ ఫర్ గెట్ ట్రూత్’ పేరుతో 4 ఎపిసోడ్స్ గల డాక్యుమెంటరీ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు వారు ప్రకటించారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 28న తొలి ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’ స్ట్రీమింగ్ కానున్నది. ఈ నెల 30న రెండో ఎపిసోడ్ ‘ది హిస్టరీ వి ఫర్ గాట్’, అక్టోబర్ 2న మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్ గాట్’ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ స్ట్రీమింగ్ డేట్‌ని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. చరిత్రకు రెండు పార్శాలుంటాయి. ఒకటి మనకు చెప్పింది. మరొకటి ఎవరికీ తెలియకుండా సమాధి చేయబడింది. అలా చరిత్రలో కనుమరుగైన నిజాలను ఈ నాలుగు ఎపిసోడ్స్ బహిర్గతం చేయనున్నాయని మేకర్స్ తెలిపారు. ‘రణబాలి’ ప్రపంచం నుంచి ఎక్స్‌క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ కంటెంట్‌తో ఈ డాక్యుమెంటరీ సిరీస్ రాబోతున్నది.