Raja Sekhar | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తాజాగా తన కుటుంబం, రాజకీయాలు, తాజా సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. హీరో శర్వానంద్ నటించిన బైకర్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ పెళ్లి గురించి మాట్లాడుతూ రాజశేఖర్ స్పష్టత ఇచ్చారు. మా అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ వాళ్లు మాత్రం ఇంకొంత కాలం సినిమాల్లో నటించాలనుకుంటున్నారు. వారి అభిరుచికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం లేదు అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుమార్తెల నిర్ణయానికి తల్లిదండ్రుల మద్దతు ఉండటం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రాజకీయాల గురించి మాట్లాడుతూ, తాము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరిపైనా ఆధారపడలేదని, సొంత డబ్బుతోనే ముందుకు వెళ్లామని చెప్పారు. అలాగే తన భార్య జీవిత రాజశేఖర్‌కి రాజకీయాలంటే ఆసక్తి లేదని వెల్లడించారు. ఇక తమిళ హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై స్పందిస్తూ, ఆయన రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలులో విజయ్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. చాలా కాలం తర్వాత రాజశేఖర్, బైకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
ఈ సినిమాలో రాజశేఖర్, శర్వానంద్‌కు తండ్రి పాత్రలో నటించగా, హీరోయిన్గా మాళవిక మోహనన్ కనిపించారు. భారతీయ సినీ చరిత్రలోనే తొలి పూర్తి స్థాయి ‘మోటో క్రాస్ డ్రామా’గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు, రాజశేఖర్ నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి.