ఇరు జట్లు కలిసి 413 పరుగులు నమోదు చేసిన పోరులో.. డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగితే.. దినేశ్ కార్తీక్ పిడుగుల్లాంటి షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆనక 5 స్టార్స్ (మయాంక్, ధవన్, భానుక, ఓడెన్, షారుక్ ఖాన్) దడదడ లాడించడంతో ఐపీఎల్ పదిహేనో సీజన్లో పంజాబ్ శుభారంభం చేసింది!!
పరుగుల వరద పారిన పోరులో పంజాబ్‌దే పైచేయి అయింది! సారథ్య బాధ్యతలు అందుకున్నాక డుప్లెసిస్ దంచికొట్టినా.. బెంగళూరు రాత మాత్రం మారలేదు. జట్టు పగ్గాలు వదిలేసిన విరాట్ కోహ్లీ ఫర్వాలేదనిపించగా.. బౌలర్ల వైఫల్యానికి రాయల్ చాలెంజర్స్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు!
నవీ ముంబై: కెప్టెన్ మారినా.. ప్లేయర్లు మారినా.. మైదానాలు మారినా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాత మాత్రం మారడం లేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన బెంగళూరు తమ తొలి పోరులో పరాజయం పాలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్లో భాగంగా ఆదివారం పరుగుల వరద పారిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. నయా సారథి ఫాఫ్ డుప్లెసిస్ (57 బంతుల్లో 88; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 41 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.
ఆఖర్లో దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్శ్‌దీప్, రాహుల్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధవన్ (43; 5 ఫోర్లు, ఒక సిక్సర్), భానుక రాజపక్స (22 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (24 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు), ఓడెన్ స్మిత్ (8 బంతుల్లో 25 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టినా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓడెన్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లోకి కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరుగనుంది.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 205/2 (డుప్లెసిస్ 88, కోహ్లీ 41 నాటౌట్; రాహుల్ చాహర్ 1/22), పంజాబ్: 19 ఓవర్లలో 208/5 (రాజపక్స 43, ధవన్ 43; సిరాజ్ 2/59).