వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ కలినరీ ఆర్ట్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను ఈ నెల 24నుంచి, మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకాం ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్ తదితర కోర్సుల సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఈ నెల 26నుంచి, ఎంసీఏ నాలుగో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 1నుంచి, బీసీఏ నాలుగో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 7వ తేదీ నుంచి, ఎల్ఎల్ఎం మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఎంపీఈడీ పరీక్షలు వాయిదా…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంపీఈడీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల రీత్యా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలను తదుపరి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఎంఈ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈ నెల 20వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.
రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 23వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
బీఫార్మసీ పరీక్షా ఫలితాల విడుదల…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ (సీబీసీఎస్) నాలుగు, ఆరు, ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలతో పాటు బీఫార్మసీ (నాన్ సీబీసీఎస్) నాలుగో సంవత్సరం మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in నందు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
జవాబు పత్రాల ఫొటోకాపీ పొందేందుకు దరఖాస్తుల స్వీకరణ…
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) పరిధిలోని ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షా జవాబు పత్రాల ఫొటోకాపీ పొందేందుకు, చాలెంజ్ వాల్యుయేషన్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంబీఏ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. ఆ ఫలితాలపై చాలెంజ్ వాల్యుయేషన్కు, తమ జవాబు పత్రాల నకలు పొందగోరే వారు వచ్చే నెల 16వ తేదీ వరకు సంబంధిత రుసుము చెల్లించి, తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in వెబ్సైట్లో చూసుకోవాలని పేర్కొన్నారు.
డీడీఎంఎస్ లో ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం…
దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళాసభ (పాత ఏఎంఎస్)లో ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ (ఒక సంవత్సరం) కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డీడీఎంఎస్ నొకేషనల్ కోర్స్ సెంటర్లో ఈ కోర్సును అందిస్తున్నట్లు చెప్పారు. కనీసం పదవ తరగతి పాసైన అన్ని వయసుల వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని వివరించారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర వివరాలకు 9397824542 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఎమ్మెస్సీ – మాలిక్యులార్ అండ్ హ్యూమన్ జెనిటిక్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎమ్మెస్సీ – మాలిక్యులార్ అండ్ హ్యూమన్ జెనిటిక్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) ప్రాయోజితం చేస్తున్న ఈ కోర్సును ఓయూ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అండ్ హాస్పెటల్ ఫర్ జెనిటిక్ డిసీజెస్ అందిస్తోందని చెప్పారు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) పరీక్షలో అర్హత సాధించిన వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inనందు చూసుకోవాలని పేర్కొన్నారు.