ముంబై: మాస్టర్‌మైండ్ మహేంద్రసింగ్ ధోనీ సలహాల వల్లే ఢిల్లీతో పోరులో చెలరేగిపోయానని చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ కాన్వే వెల్లడించాడు. ఢిల్లీపై 49 బంతుల్లో 87 పరుగులు చేసిన కాన్వే.. సహజంగా ఆడే స్వీప్ షాట్లకు బదులు స్ట్రెయిట్ హిట్లతో పరుగులు రాబట్టాడు. ‘ఈ క్రెడిట్ ధోనీకే దక్కుతుంది. గత మ్యాచ్‌లో నేను ఎక్కువగా స్వీప్ చేయడానికి ప్రయత్నించాను. కొన్ని సందర్భాల్లో ఔట్ కూడా అయ్యాను. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు “ఈ సారి నీకు ఫుల్లర్ డెలివరీలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముందుకొచ్చి నేరుగా ఆడితే పరుగులు సులువుగా రాబట్టొచ్చు”అని ధోనీ చెప్పాడు. నేను క్రీజులోకి అడుగుపెట్టాక మహీ చెప్పినట్లే చేశా’ అని కాన్వే వివరించాడు. దిగ్గజ ఆటగాడు మైక్ హస్సీతో తనను పోల్చడం ప్రత్యేకంగా అనిపిస్తున్నదని కాన్వే పేర్కొన్నాడు.