నా హనీ.. ఓ మనీ!
ప్రియమైన డబ్బూ..నా గుండె లబ్బు‘డబ్బూ’..ఎలా ఉన్నావ్? నువ్వంటే నాకు మహా లవ్వు! పాలకడలి నుంచి లక్ష్మీదేవి పుట్టుకొచ్చినట్టు.. ఏటీఎంలోంచి రెపరెపలాడుతూ నువ్వు బయటికొచ్చే దృశ్యం ప్రతిసారీ పరమాద్భుతమే. ప్రేమగా నిన్ను పర్సులోకి స్వాగతిస్తున్న సమయంలో.. నా మట్టుకు నేను విశ్వ కుబేరుడినే. నా అంత అదృష్టవంతులు ప్రపంచంలోనే లేరనిపిస్తుంది. ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ హనీ!
పౌర్ణమినాడు బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తున్నప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. నాలాంటి మధ్యతరగతి ఉద్యోగుల జీవితంలో ఒకటో తేదీ నిండు పున్నమి. క్రమంగా కృష్ణపక్షం మొదలవుతుంది. మెల్లమెల్లగా పర్సు బరువు తగ్గిపోతుంది. రెండో వారానికి నువ్వు.. నెలవంక! నేనేమో ఏ వంకతో చేబదులు అడుగుదామా అని ఎదురుచూసే అప్పుల అప్పారావు. మళ్లీ ఒకటో తేదీ పొద్దున ‘యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్..’ అన్న మెసేజ్‌తో ఠంగున సెల్‌ఫోన్ గంట మోగగానే.. నువ్వు కాలింగ్‌బెల్ నొక్కినంత ఆనందం! రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా!
నిన్ను ఎంత ప్రేమిస్తే నువ్వూ అంత ప్రేమిస్తావు. నిన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తే, నువ్వూ అంత దూరమైపోతావు. నీ మనసు సున్నితం, నీ స్వభావం చంచలం. దుబారా నీకు నచ్చదు. వృథా అస్సలు గిట్టదు. పొదుపరిని పరిపరి విధాలుగా మురిపిస్తావు. వ్యసన పీడితుడు ఎంతటివాడైనా సరే.. బ్రేకప్ చెప్పేస్తావు. నేనెప్పుడూ అలాంటి తప్పు చేయను. ఒట్టు!
నా ప్రేమకు సరే అంటే.. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఖరీదైన లెదర్ పర్సుతో నీకు ప్రేమ మందిరం కడతాను. షాపింగ్‌కో, సినిమాకో నిన్ను ఖర్చుపెట్టాల్సి వచ్చిన ప్రతిసారీ.. నేనెంత విరహ వేదన అనుభవిస్తానో తెలుసా? వీలైనంత త్వరగా నువ్వు తిరిగిరావాలని కోరుకుంటాను. అవసరమైతే ఓవర్‌టైమ్ పనిచేస్తాను. తప్పనిసరైతే మరింత జీతం వచ్చే ఉద్యోగం వెతుక్కుంటాను. ఆశకూ దురాశకూ మధ్య.. ప్రేమకూ కామానికీ ఉన్నంత తేడా! కష్టపడి డబ్బు సంపాదించడం నిజమైన ప్రేమ అయితే.. దొడ్డిదారిలో కోట్లు కూడబెట్టాలనుకోవడం కామం లాంటిది. నేను నిజమైన ప్రేమికుడిని.
కాఫీషాప్‌లో కలుద్దాం.. అంటారు. సమయానికి వెళ్లరు. మాల్లో వెయిట్ చేస్తానని మెసేజ్ పెడతారు. మాట తప్పుతారు. అలాంటి అబద్ధాల రాయుళ్లను ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడుతుంది? నువ్వూ అంతే! సకాలంలో క్రెడిట్‌కార్డు బిల్లులు కట్టనివారిని, నెలసరి వాయిదాలు(ఈఎమ్ఐలు) చెల్లించనివారిని, చేబదుళ్లు తీర్చనివారిని ఆమడ దూరం పెడతావని నాకు తెలుసు! స్వోత్కర్ష అనుకుంటావేమో .. మనం మహా పంక్చువల్! జీతం పడగానే.. ముందుగా వాయిదాలు వదిలించుకుంటాను. తర్వాత పొదుపు-మదుపు. మిగిలిన నాలుగురాళ్లతోనే షాపింగ్ అయినా, షికార్లు అయినా. ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ అంతే.
ఎంత ధైర్యం? నిన్ను కఠినాత్మురాలని అంటారా? సంపన్నుల పక్షపాతివని ఆడిపోసుకుంటారా? వాళ్ల మాటల్ని పట్టించుకోవద్దు. నీ మనసు నాకు తెలియదా? వారెన్ బఫెట్ వందకోట్లు దానం చేశాడు, రతన్‌టాటా పది కోట్లు విరాళం ఇచ్చాడు.. అంటూ పత్రికల్లో కథనాలు వచ్చిన ప్రతిసారీ ఆసక్తిగా చదివేవాణ్ని. ‘వచ్చేసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో వాళ్లకు స్థానం దక్కదేమో పాపం’ అని బాధపడేవాణ్ని. కానీ, మళ్లీ వాళ్లే కనిపించేవారు. ఇంకొంత సంపదతో మరో మెట్టు ఎక్కేవారు. అప్పటికి కానీ నీ తత్వం నాకు బోధపడలేదు. సమాజానికి తిరిగి ఇచ్చేవారికే నువ్వు మరింత ఇస్తావు! ఇనుప పెట్టెలో మురగబెట్టి మురిసిపోయేవాళ్లంటే నీకు అసహ్యం!
అప్పులు తీర్చుకోడానికో, క్రెడిట్‌కార్డు బిల్లులు కట్టడానికో, నాకంటూ ఓ ఇల్లు కట్టు కోడానికో నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించడం లేదు. వాటికి నా స్వశక్తి సరిపోతుంది. సలలితముగ నారికేళ సలిలము భంగిన్.. నా జీవితాన్ని ఆనందమయమూ, ‘అర్థ’వంతమూ చేయమని మాత్రమే నిన్ను కోరుతున్నా! నను వరించవా సిరీ!
ఇట్లు..
నీ ప్రేమికుడు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

