e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home జిందగీ బంధాల.. పొదరిల్లు

బంధాల.. పొదరిల్లు


- Advertisement -

జనని.. జన్మభూమి.. విలువైన రెండు విలువల పాఠాలు.తల్లి జన్మనిస్తే..ఊరు పెంచి పెద్ద చేస్తుంది. ఐపీఎస్‌ అధికారి సుమతి తాను పుట్టి పెరిగిన ఊరినుంచి పోరాట పటిమను నేర్చుకున్నారు. పుట్టింటి నుంచి పసుపుకుంకుమల కింద ప్రేమలూ ఆప్యాయతలూ అందుకున్నారు. నాయనమ్మలోని నాయకత్వ లక్షణం, నాన్నలోని సేవాగుణం, అమ్మలోని ప్రేమతత్వం.. ఉగ్గుపాలతో అబ్బాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, పుట్టిల్లు సుమతికి ఓ స్ఫూర్తి కేంద్రం. ఏడాదికోసారి, ఆ నాలుగు గోడల మధ్య గడిపే మూడు రోజులూ.. మిగిలిన మూడువందల అరవై రెండు రోజులూ వృత్తిపరమైన సవాళ్లను అధిగమించడానికి సరిపడా మనోబలాన్ని ఇస్తాయి. ఆ జ్ఞాపకాలన్నీ ఆమె మాటల్లోనే..

తల్గొట్ల.. నా పుట్టినిల్లు! గద్వాల జోగుళాంబ జిల్లాలోని చిన్న పల్లెటూరు. ఆ ఊరికో చరిత్ర ఉంది. ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా గద్వాల రాజు నల్ల సోమనాద్రి తుంగభద్ర తీరంలోని మా గ్రామం దగ్గరే మూడు రోజులపాటు యుద్ధం చేశాడు. ఆ చరిత్ర ఇప్పుడు ఏడో తరగతి టెక్ట్స్‌ బుక్స్‌లో కూడా ఉంది. ఆ సమయంలోనే, రక్షణగా ఏడు బుర్జులు కట్టారు. ఏ అర్ధరాత్రో శత్రువులు దాడి చేసినా దొరక్కుండా గ్రామ సంపదనంతా నేలలో, బురుజు గోడల్లో దాచారట. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట నిధులు బయటపడుతూనే ఉంటాయి. ఈ మధ్యే మా మిరపతోటలో నిధి దొరికింది. నాన్న దాన్ని ఎమ్మార్వోకు అప్పగించారు. నా వరకూ ఆ ఊరు, అక్కడి మమతలు, అమ్మానాన్నల ప్రేమలు.. ఇంతకు మించిన నిధి నిక్షేపాలు లేవనిపిస్తుంది.


మా అమ్మ పేరు సుజాతమ్మ. నాన్న తిరుపతిరెడ్డి. నాన్న మా ఊరిలో పెద్ద రైతు. మేం మొత్తం నలుగురు అక్కాచెల్లెళ్లం, ఒక అన్నయ్య. మా వంశంలో ఎనిమిది తరాలనుంచీ కూడా తరానికి ఒక్క మగ పిల్లాడు మాత్రమే పుడుతున్నాడు. మరో మగబిడ్డ కావాలని, అన్నయ్య తర్వాత కూడా ఎదురు చూశారు అమ్మానాన్నలు. కానీ, నలుగురం ఆడపిల్లలమే పుట్టాం (నవ్వుతూ..). మాలో ముగ్గురినీ రాయలసీమకు ఇచ్చారు. అక్కయ్యను కర్నూలుకు, ఓ చెల్లెను గుత్తికి ఇచ్చారు. నేను కడప. చివరి ఆమె తెలంగాణ కోడలిగా వెళ్లింది. అన్నయ్యకు ఇక్కడి అమ్మాయినే చేశారు. అమ్మానాన్న సాక్షాత్తు శివపార్వతులే. అంత అన్యోన్యంగా ఉండేవారు. మా చదువుల విషయంలో అమ్మ ఎంతో శ్రద్ధ చూపేది. ఆడపిల్లలకు చదువు తప్పనిసరి అని పట్టుబట్టేది. ఊళ్లో సరైన వసతులు లేకపోవడంతో మమ్మల్ని కర్నూలులో హాస్టల్లో , తెలిసిన వాళ్ల ఇండ్లలో పెట్టి చదివించారు.
మా కుటుంబంలో అందరం చాలా సన్నిహితంగా ఉంటాం. ఏ చిన్న సందర్భం వచ్చినా కుటుంబాలతో సహా కలుస్తాం. మా ఫ్యామిలీ అంతా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరూ రోజూ ఏదో ఒక మెసేజ్‌ పెడుతూనే ఉంటారు. దీంతో నిత్యం కలుసుకున్నట్టే ఉంటుంది. ఇదే అలవాటు మా పిల్లలకూ వచ్చింది. ప్రతి సండే ఒక గ్రూప్‌గా తమ చదువులూ హాబీస్‌ గురించి మాట్లాడుకుంటారు. ఈ మధ్యే అమ్మ మరణించారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మా అక్క ఇప్పుడు అమ్మ బాధ్యత తీసుకుంది. కుటుంబ విషయాలు వదిన చూసుకుంటుంది. అమ్మ పోయాక నాన్న నాతోనే ఉంటున్నారు.
ఏడాదిలో వచ్చే ఒక్కో పండుగను ఒకరి ఇంట్లో చేసుకుంటాం. నేను ఏటా కార్తీక మాసంలో ద్వాదశి రోజు తులసీ కల్యాణం చేస్తాను. వినాయక చవితి రోజు మా అక్క కర్నూలులో గణపతి హోమం చేస్తారు. ఇక, మా బెంగళూరు సిస్టర్‌ దగ్గరికి దసరాకు వెళతాం. పండగ రోజు సాయంత్రానికంతా మా ఊరికి చేరుకుంటాం. ఇవన్నీ కాకుండా.. ఏటా ఎండాకాలంలో కచ్చితంగా మూడు రోజులు మా ఐదు కుటుంబాలూ పిల్లలతో సహా ఊళ్లోనే గడుపుతాం. వదిన కూడా మా అక్కాచెల్లెళ్లలో ఒకరిలా కలిసిపోయారు. కొవిడ్‌ వల్ల ఈసారి కలువలేకపోయాం. కానీ, ఈ మధ్యనే మొత్తం ఆరు కార్లలో ఇరవై ఆరుమంది కుటుంబ సభ్యులం తిరుమలకు వెళ్లి వచ్చాం.
ఊరు అనగానే నానమ్మే గుర్తుకొస్తుంది. పేరు నాగలక్ష్మమ్మ. ఆమె అంటే టెర్రర్‌. నా మీద తన ప్రభావం చాలా ఉంది. మా చిన్నతనంలో ఎక్కువగా వేరుశనగ వేసేవాళ్లు. పల్లీలు కొట్టేందుకు మహిళా కూలీలు వచ్చేవారు. నానమ్మ ఒక్కొక్కరి దగ్గరా కూర్చుని, ఓపిగ్గా ఓ పది నిమిషాలు మాట్లాడేది. ‘ఎందుకు నానమ్మా! అందరి దగ్గరికీ వెళ్లి ఏదో ఒకటి అడుగుతూ ఉంటావ్‌?’ అని అడిగానొకసారి. ఆమె చెప్పిన సమాధానం ఇంకా గుర్తుంది.. ‘మన దగ్గర పనిచేసే వాళ్ల బాధలేమిటో మనం తెలుసుకోవాలి. మనం వెళ్లి అడిగితేనే చెబుతారు. వాళ్ల అవసరాలు తెలుసుకోవడం యజమానిగా మన బాధ్యత కూడా’. మానవ సంబంధాలకు సంబంధించి ఇంత కంటే గొప్ప మాట ఎక్కడుంది?
నానమ్మ ఎనిమిది గజాల చీరలు కట్టేది. ఓ పదిసార్లు కట్టిన తర్వాత చీరలు మెత్తబడేవి. వాటిని శుభ్రంగా ఉతికించి, ప్రత్యేకంగా ఒక అలమరాలో దాచేది. అట్లానే, ఇంట్లో ఇప్పటికీ నెయ్యి తయారు చేస్తుంటారు. నానమ్మ పావుకిలో చొప్పున చిన్నచిన్న డబ్బాల్లో పెట్టించేది. ఆ రోజుల్లో మంచి వరి బియ్యం అందరికీ దొరికేవి కాదు. పంట వచ్చిన తర్వాత, పదిహేను కిలోల చొప్పున కొంత బియ్యం మూట కట్టించేది. ఎవరికైనా డెలివరీ అయ్యిందని తెలిస్తే.. ఈ మూడూ కలిపి ఇచ్చేది. ఇవన్నీ ఎందుకు చేస్తుందో.. నా చిన్న బుర్రకు అర్థం కాకపోయేది. ఒకసారి నానమ్మను ఇదే ప్రశ్న అడిగాను. ‘ప్రసవం సమయంలో, చావు అప్పుడూ మనిషిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కారణంగా కొంతమందికి అది సాధ్యం కాకపోవచ్చు. పుట్టే పిల్లలకు కాటన్‌ చీరలు మెత్తగా ఉంటాయి. అందుకే చీరలు ఇస్తున్నా. పౌష్ఠికాహారం తినే పరిస్థితి ఉండదు కాబట్టి, బియ్యం పంపుతున్నా. ఇక, నెయ్యి ద్వారా బాలింతకు శక్తి అందుతుంది’ అని వివరంగా చెప్పింది. కొన్నిసార్లు హఠాత్తుగా ఇంట్లోకి వెళ్లి చీర తెచ్చి ఎవరో ఒకరికి ఇచ్చేది. దానికి కూడా కారణం తెలిసింది. కూలీ పనులకు వచ్చే మహిళలకు నెలసరి సమయంలో న్యాప్‌కిన్‌లు వాడే స్థోమత ఉండదు. పనినుంచి ఇంటికి వెళ్లేలోపు ఇబ్బంది పడకుండా ఆ ఎనిమిది గజాల చీర కాపాడుతుందన్న నమ్మకం. సాటి మహిళ గౌరవాన్ని నిలబెట్టేందుకు నానమ్మ అంత తాపత్రయ పడేది.


కాలి నడకన శ్రీశైలం వెళ్లే యాత్రికులు మా ఇంటి ముందు నుంచే వెళతారు. వాళ్లకు మా ఇంట్లోనే ఒక పూట భోజనం పెట్టేవారు. ‘నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. దానధర్మాలు చేసుకుంటూ పోతే పెండ్లిళ్లు చేయడం కష్టం’అని బంధువులు, చుట్టుపక్కలవాళ్లు సలహా ఇచ్చేవారు. ‘ఏం పర్వాలేదమ్మా! ఎంతో కష్టపడి కాలినడకన వెళ్తున్నారు. వాళ్లుకూడా భగవంతుడితో సమానమే. ఉన్నంతలో సాయం చేద్దాం. మిగిలింది ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు’ అనేది నానమ్మ. ఇప్పటికీ భక్తులు రాత్రిళ్లు మా ఇంట్లోనే పడుకుంటారు.
‘ఇంత చిన్న ఊళ్లో ఉన్నా నేనూ, మీ నాన్న.. ఉన్నంతలో పదిమందికి సాయం చేస్తున్నాం. అదే నువ్వు పెద్ద ఆఫీసర్‌ అయితే మా కంటే ఎక్కువ మందికి సాయం చేయొచ్చు. అందుకే నువ్వు పోలీస్‌ ఆఫీసర్‌ కావాలి సుమతమ్మా…’ అని మళ్లీ మళ్లీ చెప్పేది నానమ్మ. ఆ మాటలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. పుట్టింటి వారసత్వంగా వచ్చిన విలువలనే ఉద్యోగంలోనూ పాటిస్తున్నాను.
కుటుంబ విలువలు నేర్పాలి
ఒక కుటుంబంలోని పిల్లలంతా ఒక తాటిపైన నడవాలి. వాళ్ల మధ్య అనుబంధాలు పెరగాలి. ఫంక్షన్లప్పుడు అందంగా తయారై కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని, తిరిగి ఎవరిండ్లకు వాళ్లు వెళ్లిపోతే ఉపయోగం లేదు. దానివల్ల కుటుంబ విలువలు ఒకరినుంచి ఒకరికి వెళ్లవు. నేను నా అత్తామామలను ఎలా చూసుకుంటున్నాను? ఇంట్లో పెద్దవాళ్లతో, బంధువులతో ఎట్లా ఉంటున్నాను? అన్నది పిల్లలు గమనిస్తూ ఉంటారు. అలానే, వాళ్లు కుటుంబ విలువలు తెలుసుకుంటారు. అందుకే, మేం ఫ్యామిలీకి వీలైనంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం.
అత్తమ్మ కాదు అమ్మ!
మాది కులాంతర వివాహం. కానీ, మా కుటుంబంలో ఎలాంటి అరమరికలూ లేవు. మా అత్తమ్మ నాకు అమ్మకంటే ఎక్కువ. ‘నాకు ముగ్గురు కొడుకులు. కూతుళ్లు లేరు. కానీ నా కొడుకుల కంటే ఎక్కువగా నా కోడలు సుమతమ్మకే నేను ఏమిటో, నా అవసరాలు ఏమిటో తెలుసు. తను నాకు కోడలు కాదు..కూతురు’ అంటుంటారు మా అత్తగారు.
నాగోజు సత్యనారాయణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement