సరిగ్గా మూడేండ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై తెలంగాణ యువ జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి కొత్త చరిత్ర లిఖించింది. అంచనాల్లేకుండా బరిలోకి దిగి.. అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకంతో మెరిసింది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డుల్లోకెక్కింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కెరీర్ మంచి జోష్‌లో ఉన్నప్పుడు అరుణను గాయాలు వేధించాయి. ఊపిరి బిగపట్టే సాహస విన్యాసాల సమాహారమైన జిమ్నాస్టిక్స్‌లో అదుపు తప్పితే అంతే సంగతులు. ఓవైపు గాయాలు బాధిస్తున్నా..
పడిలేచిన కెరటంలా అరుణ పుంజుకున్న తీరు అద్భుతమని చెప్పాలి. టోక్యో ఒలింపిక్స్ అర్హత చేజార్చుకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోని ఈ యువ జిమ్నాస్ట్ తాజాగా ఈజిప్టు టోర్నీలో పసిడి కాంతులు విరజిమ్మింది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన అరుణ..రానున్న ప్రపంచకప్ టోర్నీలతో పాటు ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పతకమే లక్ష్యమని ధీమాగా చెబుతున్నది. ఈ నేపథ్యంలో జిమ్నాస్ట్ అరుణారెడ్డితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
ఈజిప్టులో పసిడి ప్రదర్శనపై మీ స్పందన?
అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య(ఎఫ్ఐజీ) ఇన్విటేషన్లో భాగంగా ఈజిప్టు రాజధాని కైరో వేదికగా జరిగిన హరోస్ కప్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం 12 దేశాల నుంచి దాదాపు 120 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొన్న ఈ టోర్నీలో పోటీ హోరాహోరీగా సాగింది. నేను బరిలోకి దిగిన టేబుల్ వాల్ట్, ఫ్లోర్ ఈవెంట్లలో ఈజిప్టు, పోలండ్ ప్లేయర్ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో పసిడి పతకాలు సాధించగలిగాను. ఈ టోర్నీలో పతకాలు దక్కించుకోవడం ద్వారా భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించగలనన్న ధీమా వచ్చింది. దీనికి తోడు గాయం నుంచి కోలుకుని ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్న నాకు మంచి కిక్ ఇచ్చే విజయమిది. మొత్తంగా ఆయా దేశాల నుంచి ఒలింపిక్ స్థాయి జిమ్నాస్ట్‌ల నుంచి పోటీ ఎదుర్కొవడం రానున్న టోర్నీల్లో మరింతగా రాణించేందుకు దోహదపడనుంది.
తదుపరి లక్ష్యమేంటి?
బర్మింగ్‌హామ్ వేదకగా జూలైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పతకమే తదుపరి లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. అయితే కామన్వెల్త్ కంటే ముందు మార్చిలో బాకు(అజర్బైజాన్), కైరో(ఈజిప్టు)వేదికలుగా జరిగే ప్రతిష్ఠాత్మక జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో రాణించడంపై ప్రధానం దృష్టి పెట్టాను. ఇందుకోసం కోచ్ మనోజ్ రాణా శిక్షణలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటూ ముందుకు సాగాలనుకుంటున్నాను. ఈ రెండు టోర్నీలతో పాటు మేలో జరిగే మేజర్ టోర్నీల్లోనూ సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నాను. రాణా నేతృత్వంలో ఆయా టోర్నీలకు అనుగుణంగా సిద్ధమవుతున్నాను. టోర్నీకి టోర్నీకి ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ, అదే సమయంలో లోపాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఓవైపు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు ఫిట్నెస్ను కాపాడుకోవాలని చూస్తున్నాను. అందుకు కావాల్సిన డైట్, ఎక్సర్‌సైజ్‌లను రాణా సార్ సమకూరుస్తున్నారు. ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో పతకాలు సాధిస్తూ ఓవరాల్‌గా 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హతపై గురిపెట్టాను. ప్రపంచకప్‌లో రాణించడం ద్వారా కీలకమైన ర్యాంకింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకునేందుకు పక్కా ప్రణాళికను ఎంచుకున్నాను.
కెరీర్‌పై గాయం ప్రభావం?
2018లో ఆస్ట్రేలియాలో జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత నా కెరీర్లో ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. మంచి ఫామ్‌మీదున్న తరుణంలో గాయాలు వేధించాయి. ప్రమాదకర క్రీడగా పేరొందిన జిమ్నాస్టిక్స్‌లో గాయాల ముప్పు ఎప్పుడు పొంచి ఉంటుంది. ఏ కొంచెం అదుపు తప్పినా తీవ్ర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణానికి ముప్పు వాటిల్లవచ్చు. కెరీర్లో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో మోకాలుకు శస్త్రచికిత్స జరిగింది. దీని నుంచి కోలుకుంటున్న తరుణంలోనే ఏడాది లోపు మళ్లీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయాను. టోక్యో విశ్వక్రీడల కోసం ప్రపంచ కప్‌లో బరిలోకి దిగినా లాభం లేకపోయింది.
కుటుంబ సభ్యుల సహకారం?
గాయంతో ప్రాక్టీస్‌కు దూరమైన సమయంలో కుటుంబ సభ్యుల మద్దతుతో పాటు కోచ్ రానా చాలా సహకరించారు. క్లిష్ట సమయంలో వీళ్లంతా నా వెన్నంటి నిలిచారు. కెరీర్ ఒక రకంగా ప్రమాదంలో పడిందనుకున్న దశలో వారి ఇచ్చిన ప్రోత్సాహాం వెలకట్టలేనిది. అనునిత్యం నాకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ, మనోైస్థెర్యం కోల్పోకుండా అండగా నిలబడ్డారు. జిమ్నాస్టిక్స్‌లో ఒకసారి గాయపడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అత్యుత్తమ చికిత్సకు తోడు ఆహారం, ఫిట్‌నెస్‌పై ప్రధానంగా దృష్టి పెట్టడంతో త్వరగా కోలుకోగలిగాను.
రాణా శిక్షణ ఎలా ఉంది?
జిమ్నాస్టిక్స్‌లో అపార అనభవమున్న మనోజ్ రాణా దగ్గర శిక్షణ చాలా బాగుంది. ఆయా టోర్నీలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం రాణా సార్ శిక్షణ ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీల్లో ప్రత్యర్థులను బట్టి వ్యుహాలు రచిస్తూ ఉంటారు. ఓవైపు అత్యుత్తమ స్థాయి శిక్షణనిస్తూనే..ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కరోనా వైరస్ విజృంభణ సమయంలో మన దగ్గర సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో..రాణా సహకారంతో ఢిల్లీ, హర్యానా ప్రాంతంలో ప్రాక్టీస్ చేశాను. ఈజిప్టు టోర్నీకి ఇది బాగా ఉపయోగపడింది. ఇలా టోర్నీ టోర్నీకి లక్ష్యాన్ని ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాను. గతంలో నా ప్రదర్శనకు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈజిప్టు ప్రదర్శనను రానున్న టోర్నీల్లోనూ కొనసాగిస్తానన్న నమ్మకం నాకుంది. స్వర్ణ పతకాల ప్రదర్శనకు గుర్తింపుగా చాముండేశ్వరీనాథ్ కారు బహుమతిగా ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆయన గతంలో గ్రీన్కో సంస్థ ద్వారా పలు చాంపియన్‌షిప్‌లలో పాల్గొనేందుకు ఆర్థిక సాయం చేశారు.