ప్రధాన ప్రత్యర్థుల గైర్హాజరీలో.. నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తున్న స్పెయిన్ బుల్ నాదల్ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించిన నాదల్.. ఆదివారం జరుగనున్న తుదిపోరులో డానిల్ మెద్వెదెవ్‌తో తలపడనున్నాడు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెదరర్, జొకోవిచ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న నాదల్..మెగా ఫైట్‌లో పైచేయి సాధిస్తే.. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్రకెక్కనున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో 27వ సీడ్ కొలిన్స్‌తో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ నేడు అమీతుమీ తేల్చుకోనుంది!
మెల్బోర్న్: పురుషుల సింగిల్స్‌లో రికార్డు టైటిల్‌పై కన్నేసిన రఫేల్ నాదల్ (స్పెయిన్) అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ దక్కించుకున్న ఆటగాడిగా నిలిచేందుకు ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న నాదల్.. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 35 ఏండ్ల నాదల్ 6-3, 6-2, 3-6, 6-3తో ఏడో సీడ్ మాటియో బెర్టినిపై విజయం సాధించాడు. మిగిలిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో పోల్చుకుంటే ఆస్ట్రేలియా ఓపెన్‌లో కాస్త వెనుకబడి ఉన్న నాదల్.. ఇక్కడ కేవలం ఒకే టైటిల్ గెలిచాడు. ఓవరాల్‌గా 29వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడనున్న నాదల్.. మెల్బోర్న్లో తుదిపోరుకు చేరడం ఇది ఆరోసారి కావడం విశేషం. శుక్రవారమే జరిగిన మరో సెమీస్‌లో రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ 7-6 (7/5), 4-6, 6-4, 6-1తో స్టిఫనోస్ సిట్సిపాస్‌పై గెలిచి ఫైనల్‌కు చేరాడు. ఆదివారం జరుగనున్న మెగా ఫైనల్లో యూఎస్ ఓపెన్ చాంపియన్ డానియల్ మెద్వెదెవ్‌తో నాదల్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
అడుగు దూరమే!
సహచర ఆటగాళ్లు నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్ గైర్హాజరీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాదల్.. పురుషుల టెన్నిస్‌లో నయా చరిత్ర లిఖించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఇప్పటి వరకు పెద్దగా పోటీ ఎదుర్కోకుండానే సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్పెయిన్ బుల్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గతేడాది తనకు అచ్చొచ్చిన మట్టి కోట ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ చేతిలో పరాజయం పాలైన నాదల్.. ఆ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. కాలి గాయం తీవ్రత పెరగడంతో ఒక దశలో తిరిగి కోర్టులో అడుగు పెట్టడం కూడా కష్టమే అని భావించిన నాదల్.. మొక్కవోని దీక్షతో ఫిట్నెస్ సంతరించుకొని సత్తాచాటుతున్నాడు. శుక్రవారం పోరులో తొలి రెండు సెట్లను సునాయాసంగా చేజిక్కించుకున్న నాదల్కు.. మూడో సెట్లో బెర్టిని నుంచి పోటీ ఎదురైంది. ఒత్తిడిలో సెట్‌ను చేజార్చుకున్న నాదల్.. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో నాలుగో సెట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 14 ఏస్‌లు సంధించిన బెర్టిని.. నాదల్‌పై పట్టు సాధించాలని ప్రయత్నించినా.. ఐదు ఏస్‌లకే పరిమితమైన స్పెయిన్ బుల్ అనుభవాన్ని రంగరించి కీలక సమయాల్లో పాయింట్లు కొల్లగొట్టాడు. విజయం సాధించిన అనంతరం మూడుసార్లు గాల్లోకి పంచ్‌లు విసురుతూ సంబురాలు జరుపుకున్న నాదల్.. మెల్బోర్న్లో ఫైనల్‌కు చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. తీవ్ర ఉక్కపోత మధ్య సాగిన మరో సెమీస్‌లో 13 ఏస్‌లతో విజృంభించిన మెద్వెదెవ్ నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేసినా.. విన్నర్లలో ఆధిక్యం కనబర్చి టైటిల్ ఫైట్‌కు సిద్ధమయ్యాడు.
కాలి గాయం తర్వాత తిరిగి కోలుకొని టెన్నిస్ ఆడుతాననుకోలేదు. కానీ పట్టుదలతో ప్రయత్నించడం వల్లే మళ్లీ మీ ముందుకు వచ్చా. ప్రపంచ అగ్రస్థాయి ఆటగాళ్లతో ఆడుతున్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయక తప్పదు. ఇక్కడ నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. గతంలో అత్యుత్తమ ఆటగాళ్ల చేతిలో ఓటములు ఎదురయ్యాయి. ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలువగలిగా.. 2022లో మరో చాన్స్ వస్తుందని అనుకోలేదు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. – నాదల్