Mega 158 | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమాల షూటింగ్ ప్రారంభ సన్నివేశాలతో మొదలవుతుండగా, ఈ సినిమా మాత్రం నేరుగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో ప్రారంభమైందని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ ఇంటర్వెల్ సీన్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా హై-వోల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం వెనుక ఓ సెంటిమెంట్ కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ సమయంలో కూడా కీలక యాక్షన్ సన్నివేశాలను ముందుగానే చిత్రీకరించడం, ఆ సినిమా భారీ విజయానికి కారణమైందనే అభిప్రాయం ఉంది. దీంతో అదే సెంటిమెంట్‌ను ‘మెగా 158’లో కూడా ఫాలో అవుతున్నారని చెబుతున్నారు.
ఈ కీలక ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. చిరంజీవి, మోహన్ లాల్ వంటి ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా ఇంటర్వెల్ వంటి పవర్ఫుల్ ఘట్టంలో కనిపించబోతుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే మోహన్ లాల్ పాత్ర స్వరూపం ఏంటి? ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తారా లేదా కీలక సపోర్టింగ్ రోల్లో ఉంటారా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మోహన్ లాల్ బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఆయన డేట్స్‌ను బట్టి ఈ ఇంటర్వెల్ సీన్‌తోనే షూటింగ్ ప్రారంభించారనే మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. కారణాలు ఏవైనా, హిట్ సెంటిమెంట్‌ను మాత్రం బాబీ ఈసారి కూడా కొనసాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
‘మెగా 158’ను భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా, ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవిని రస్టిక్ మాస్ అవతార్‌లో చూపించబోతున్నారని సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’లో కనిపించిన వింటేజ్ లుక్ కంటే ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభంలోనే ఇంతటి భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడం ద్వారా సినిమా మూడ్, టెక్నికల్ క్వాలిటీపై స్పష్టత వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. సెంటిమెంట్‌ను నమ్ముకుంటూనే కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బాబీ మెగా ప్లాన్ అమలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇంటర్వెల్ సీన్‌తో ప్రారంభమైన ఈ సినిమా ప్రయాణం 2027 సంక్రాంతి బరిలో భారీగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్లో చర్చ సాగుతోంది. అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ మరో బ్లాక్‌బస్టర్ ఇవ్వడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.