కన్ను గీటుతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అలరిస్తున్న ఈ కుర్ర భామ రీసెంట్గా చెక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రియా ప్రకాశ్‌కు తొలి తెలుగు సినిమా కాగా, ఇందులో ఉన్నంత సేపు ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేసింది. చెక్ చిత్రం ఫ్లాప్ టాక్ దక్కించుకోవడంతో ప్రియా అందరి దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో మరో సినిమా చేస్తోంది.
జాంబీల నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డి సనిమాతో తేజా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తేజా చాలా చక్కగా నటించాడు. ఇప్పుడు తన రెండో సినిమాగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ వస్తోన్న ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. తేజా సీరియస్ లుక్‌లో కనిపిస్తుంటే, ప్రియా ప్రకాశ్ వారియర్ నవ్వుతూ కనిపిస్తుంది. వారి ముందు పగిలిన అద్దాలు ఉన్నాయి. ఈ సినిమాను SS రాజు దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్బీ చౌదరి దీనిని సమర్పిస్తున్నాడు. మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నాడు.