గత కొన్నేండ్లుగా విండీస్‌పై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ వస్తున్న టీమ్ఇండియా అదే జోష్‌లో మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండో పోరులోనూ రోహిత్ సేనకు కనీస పోటీనివ్వలేకపోయిన వెస్టిండీస్ మరో మ్యాచ్మిగిలుండగానే సిరీస్ కోల్పోయింది. టాప్-3 విఫలమైనా.. మిడిలార్డర్ ఆదుకోవడంతో టీమ్ఇండియా మెరుగైనస్కోరు చేస్తే.. ఓ మాదిరి లక్ష్యఛేదనలో ప్రసిద్ధ్ కృష్ణ ధాటికి ఒక్కరు కూడా నిలువకపోవడంతో కరీబియన్లకు ఓటమి తప్పలేదు!
ప్రసిద్ధ్ కృష్ణ (9-3-12-4)
సీనియర్ పేసర్లు బుమ్రా, షమీ, భువనేశ్వర్ అందుబాటులో లేకపోవడంతో జట్టులో చోటు దక్కించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ తన పేస్, బౌన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆడేందుకు ఏమాత్రం వీలులేని బంతులతో కరీబియన్లను కన్ఫ్యూజ్ చేస్తూ వికెట్లు పడగొట్టాడు. లక్ష్యం చిన్నదే అయినా.. విండీస్ ఆటగాళ్లు నిలబడేందుకు ప్రయత్నించలేదు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు భారీ షాట్లకు యత్నించి ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. గాయం కారణంగా కెప్టెన్ పొలార్డ్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. పూరన్ జట్టుకు సారథ్యం వహించాడు. గత 17 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేకపోవడం ఇది 11వసారి కావడం గమనార్హం. ప్రసిద్ధ్‌కు శార్దూల్ తోడవడంతో చూస్తుండగానే విండీస్ కుప్పకూలింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. దీపక్ హుడాకు ఇదే తొలి అంతర్జాతీయ వికెట్ కావడం విశేషం.
అహ్మదాబాద్: స్టార్ ఆటగాళ్లు విఫలమైనా.. కొత్త ప్లేయర్లు సత్తాచాటడంతో టీమ్ఇండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్‌ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ సేన 44 పరుగుల తేడాతో విండీస్‌ను మట్టికరిపించి.. 2-0తో సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (64) అర్ధశతకం సాధించగా.. లోకేశ్ రాహుల్ (49) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (5)తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ (18), విరాట్ కోహ్లీ (18) తడబడ్డ చోట.. సూర్యకుమార్, రాహుల్ పోరాడారు. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (24), దీపక్ హుడా (29) తమ వంతు పాత్ర పోషించారు. విండీస్ బౌలర్లలో ఓడెన్ స్మిత్, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ తడబడింది. భారత పేసర్ల ధాటికి 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్స్ (44) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. బౌన్సర్లతో కరీబియన్ల వెన్నులో వణుకు పుట్టించిన ప్రసిద్ధ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం ఇక్కడే జరుగనుంది.
సూపర్ సూర్య
భారత బ్యాటింగ్‌కు మూలాధారమైన మొదటి ముగ్గురు ప్లేయర్లు విఫలమవడంతో టీమ్ఇండియా ఒక దశలో 43/3తో కష్టాల్లో పడింది. కొత్త జోడీని పరీక్షించాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపగా.. ఈ ప్రయోగం పెద్దగా ఫలితాన్నివ్వలేదు! మూడో ఓవర్లో రోహిత్ ఔట్ కాగా.. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఓడెన్ స్మిత్.. పంత్‌తో పాటు విరాట్‌ను ఔట్ చేసి భారత్‌ను భారీ దెబ్బ కొట్టాడు. ఈ దశలో లోకేశ్ రాహుల్, సూర్యకుమార్ గొప్ప సంయమనంతో ముందుకు సాగారు. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభిస్తుండటంతో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్న ఈ జోడీ.. కుదురుకున్నాక వేగంగా పరుగులు రాబట్టింది. ఇక భారీ స్కోరు ఖాయమే అనుకుంటున్న దశలో అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో రాహుల్ రనౌట్ కాగా.. సూర్యకుమార్‌ను ఫాబియన్ అలెన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో ఆడిన తొలి ఆరు వన్డేల్లో 30కి పైగా పరుగులు సాధించిన మొదటి ప్లేయర్‌గా సూర్యకుమార్ నిలిచాడు. ఆఖర్లో సుందర్, దీపక్ హుడా విలువైన పరుగులు సాధించారు.
స్కోరు బోర్డు
భారత్: రోహిత్ (సి) హోప్ (బి) రోచ్ 5, పంత్ (బి) హోల్డర్ (సి) ఓడెన్ 18, కోహ్లీ (సి) హోప్ (బి) ఓడెన్ 18, రాహుల్ (రనౌట్) 49, సూర్యకుమార్ (సి) జోసెఫ్ (బి) అలెన్ 64, సుందర్ (సి) జోసెఫ్ (బి) అకీల్ 24, దీపక్ హుడా (సి) అకీల్ (బి) హోల్డర్ 29, శార్దూల్ (సి) బ్రూక్స్ (బి) జోసెఫ్ 8, సిరాజ్ (సి) హోప్ (బి) జోసెఫ్ 3, చాహల్ (నాటౌట్) 11, ప్రసిద్ధ్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 50 ఓవర్లలో 237/9. వికెట్ల పతనం: 1-9, 2-39, 3-43, 4-134, 5-177, 6-192, 7-212, 8-224, 9-226, బౌలింగ్: రోచ్ 8-0-42-1, జోసెఫ్ 10-0-36-2, ఓడెన్ 7-0-29-2, హోల్డర్ 9-2-37-1, అకీల్ 6-0-39-1, అలెన్ 10-0-50-1.
వెస్టిండీస్: హోప్ (సి) సూర్యకుమార్ (బి) చాహల్ 27, బ్రాండన్ కింగ్ (సి) పంత్ (బి) ప్రసిద్ధ్ 18, బ్రావో (సి) పంత్ (బి) ప్రసిద్ధ్ 1, బ్రూక్స్ (సి) సూర్యకుమార్ (బి) హుడా 44, పూరన్ (సి) రోహిత్ (బి) ప్రసిద్ధ్ 9, హోల్డర్ (సి) హుడా (బి) శార్దూల్ 2, అకీల్ (సి) పంత్ (బి) శార్దూల్ 34, అలెన్ (సి) పంత్ (బి) సిరాజ్ 13, స్మిత్ (సి) కోహ్లీ (బి) సుందర్ 24, జోసెఫ్ (నాటౌట్) 7, రోచ్ (ఎల్బీ) ప్రసిద్ధ్ 0, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 46 ఓవర్లలో 193 ఆలౌట్. వికెట్ల పతనం: 1-32, 2-38, 3-52, 4-66, 5-76, 6-117, 7-159, 8-159, 9-193, 10-193, బౌలింగ్: సిరాజ్ 9-1-38-1, శార్దూల్ 9-1-41-2, ప్రసిద్ధ్ కృష్ణ 9-3-12-4, చాహల్ 10-0-45-1, సుందర్ 5-0-28-1, దీపక్ హుడా 4-0-24-1.