వాషింగ్టన్: నేనేమీ రేపిస్టును కాదు, నేను ఎవర్నీ రేప్ చేయలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. తాను పెడోఫైల్ కూడా కాదన్నారు. వైట్‌హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్లో ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ కోల్ టామస్ అల్లన్ అనే వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ ఘటన ముగిసిన తర్వాత సీబీఎస్ న్యూస్ ఛానల్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిందితుడు అల్లెన్ రిలీజ్ చేసిన ఓ లేఖ ఆధారంగా టీవీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులు ఇచ్చారు.
ఓ సందర్భంలో ట్రంప్ తన సహనాన్ని కోల్పోయారు. అనుమానిత షూటర్ అల్లెన్ ఓ మ్యానిఫెస్టోను రిలీజ్ ఛేశాడు. దాంట్లో ట్రంప్ వైఖరిని తప్పుపట్టాడు. ట్రంప్‌ను రేపిస్టుగా, ఫెడోఫైల్గా అతను పేర్కొన్నాడు. ఆ ఆరోపణల గురించి టీవీ యాంకర్ తన ఇంటర్వ్యూలో ట్రంప్‌ను అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ తానేమీ రేపిస్టు కాదు అని, పెడోఫైల్ను కాదన్నారు. షూటర్ అల్లెన్ ఓ ర్యాడికల్ అయ్యాడని, అతను క్రీస్తు వ్యతిరేకిగా మారాడని, ఆ నిందితుడు ఆరోగ్యం సరిగా లేదని ట్రంప్ అన్నారు.
షూటర్ మ్యానిఫెస్టోను జర్నలిస్టు నోరా ఓడొన్నల్ చదువుతున్న సమయంలో ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ మీరు ఓ గమ్మత్తు మనుషులంటూ జర్నలిస్టుపై ట్రంప్ కామెంట్ చేశారు. ఆ షూటర్ మీ గురించే చెబుతున్నారని మీరు అనుకుంటున్నారా అని అడిగిన సమయంలో ఆ ప్రశ్నను దాటవేస్తూ.. తానేమీ పెడోఫైల్(పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి) కాదన్నారు. షూటర్ మ్యానిఫెస్టో గురించి తనకు కూడా కొంత తెలిసిందని, అతను ర్యాడికల్లా మారాడని, తొలుత క్రైస్తవాన్ని నమ్మాడని, కానీ ఆ తర్వాత అతను క్రీస్తుకు వ్యతిరేకిగా మారినట్లు చెప్పారు. బహుశా అతని ఆరోగ్యం సరిగా లేదని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
డెమెక్రటిక్ నేతలు ఇస్తున్న విద్వేష ప్రసంగాలను కూడా ట్రంప్ తప్పుపట్టారు. ఆ ప్రసంగాలు చాలా ప్రమాదకరమైనవని, దేశంలో రాజకీయ హింసకు అదే కారణమన్నారు. డిన్నర్ పార్టీలో నిందితుడు కాల్పులు జరుగుతున్న సమయంలో ప్రధాన వేదికపై ఉన్నట్లు చెప్పిన ట్రంప్.. అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సాహాంతో ఉండిపోయినట్లు తెలిపారు. కాల్పుల శబ్ధం వినిపించిన సమయంలో తానేమీ ఆందోళన చెందలేదని ట్రంప్ అన్నారు. జీవితం అంటే ఏంటో తనకు తెలుసు అని, మనం ఓ క్రేజీ ప్రపంచంలో జీవిస్తున్నామన్న వాస్తవాన్ని తెలుసుకోవానల్నారు. గడిచిన రెండేళ్లలో మూడోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది.