ఐపీఎల్ అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్ అదుర్స్ అనిపిస్తున్నది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో కట్టి పడేస్తున్న హార్దిక్ పాండ్యా సేన.. ఏడు మ్యాచ్‌ల్లో ఆరో విజయంతో సిక్సర్ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్‌లో సారథి హార్దిక్ ముందుండి నడిపించడంతో ఓ మోస్తరు స్కోరు చేసిన టైటాన్స్.. ఆ తర్వాత రస్సెల్ భయపెట్టిన కట్టుదిట్టమైన బంతులతో కోల్‌కతాను కట్టడి చేసి ఈ సీజన్లో అత్యల్ప స్కోరును కాపాడుకుంది. తాజా ఫలితంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. కోల్‌కతా వరుసగా నాలుగో పరాజయాన్ని తమ పేరిట రాసుకుంది.
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15లో వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన హార్దిక్ సేన.. ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు వడి వడిగా అడుగులు వేస్తున్నది. శనివారం జరిగిన లో స్కోరింగ్ గేమ్‌లో గుజరాత్ 8 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
సారథ్య బాధ్యతలు చేపట్టాక నిలకడగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా (49 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హ్యాట్రిక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. మిల్లర్ (27), సాహా (25) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 4, సౌథీ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. రస్సెల్ (25 బంతుల్లో 48; ఒక ఫోర్, 6 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. బిల్లింగ్స్ (4), నరైన్ (5), శ్రేయస్ అయ్యర్ (12), నితీశ్ రాణా (2), వెంకటేశ్ అయ్యర్ (17) విఫలమయ్యారు. విజయానికి చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టిన రస్సెల్.. రెండో బాల్‌కు ఔట్ కావడంతో కోల్‌కతాకు పరాజయం తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో ష మీ, రషీద్ ఖాన్, యష్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
గుజరాత్: 20 ఓవర్లలో 156/9 (హార్దిక్ 67, మిల్లర్ 27; రస్సెల్ 4/5, సౌథీ 3/24),
కోల్‌కతా: 20 ఓవర్లలో 148/8 (రస్సెల్ 48, రింకూ సింగ్ 35; షమీ 2/20, రషీద్ 2/22).
మైదానంలో ఎక్కడ చూసినా తానే ఉన్నట్లు కనిపించిన కోల్‌కతా ఫీల్డర్ రింకూ సింగ్ ఈ మ్యాచ్‌లో
4 క్యాచ్‌లు అందుకుంటే.. ఆఖరి ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన రస్సెల్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మనోహర్, ఫెర్గూసన్, తెవాటియా, దయాల్‌ను ఔట్ చేశాడు.