హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హిమాచల్ ప్రదేశ్ కైవసం చేసుకుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో హిమాచల్ 20-10 తేడాతో రైల్వేస్‌ను చిత్తు చేసి ట్రోఫీ చేజిక్కించుకుంది. మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కింది. టోర్నీ ముగింపు కార్యక్రమానికి హాజరైన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. క్రీడారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. త్వరలోనే సాట్స్, రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా అతిపెద్ద స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. గత రెండేండ్లుగా నగరంలో అంతర్జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీ లు నిర్వహిస్తున్న జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు.