హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్(మినీ) అసోసియేషన్ అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ఆరోపించారు. ఈమేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 1వ తేదీ దాటినా ఏప్రిల్, మే నెలల వేతనాలు జమ చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. వెట్టిచాకిరీ చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న అంగన్వాడీలపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఎండతీవ్రత నేపథ్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను జూన్ 13 వరకు పొడిగించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓఝా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 14న ఆది వారం కావడంతో 15న సోమవారం అంగన్వాడీ కేంద్రాలు తిరిగితెరుచుకోనున్నాయి. అప్పటివరకు టేక్ హోం రేషన్ సౌకర్యాన్ని అమలు చేయనున్నారు.