1. చల్లదనం
బల్లులు చల్లదనాన్ని భరించలేవు. ఇవి ఎక్కువగా వేడిగా ఉండే ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుతాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడితే బల్లులు తట్టుకోలేవు. కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు ఏసీని పెంచండి. దాంతో బల్లులు కనిపించకుండా పోతాయి. లేదంటే ఓ స్ప్రే బాటిల్లో చల్లటి నీళ్లు తీసుకుని వాటిపై స్ప్రే చేసినా బల్లులు పారిపోతాయి.
2. నిమ్మ
నిమ్మ లాంటి సిట్రస్ జాతి మొక్కల వాసన కేవలం బల్లులే కాదు, ఏ పురుగులకు కూడా పడదు. సిట్రస్ పండ్లను, ఆకులను బల్లులు, పురుగులు అసహ్యించుకుంటాయి. కాబట్టి నిమ్మకాయ ముక్కలనుగానీ, నిమ్మ ఆకులనుగానీ బల్లులు తిరిగేచోట పెడితే అవి రాకుండా ఉంటాయి. అంతేగాక నిమ్మగడ్డిని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేస్తే కూడా బల్లులు దరిచేరవు.
3. కర్పూరం
కర్పూరం వాసన కూడా బల్లులకు అస్సలు పడదు. కర్పూరం వాసన వాటికి ఎలర్జీ ఫీల్‌ను ఇస్తుందట. అందుకే కర్పూరానికి దూరంగా ఉంటాయట. కాబట్టి ఇంట్లో అక్కడక్కడ కర్పూరం బిళ్లలు పెడితే బల్లులు దెబ్బకు పారిపోతాయి.
4. పరిశుభ్రత
బల్లులు ఊరికెనే ఇంట్లోకి రావు. మీ ఇంట్లో ఆహారం దొరికితేనే అవి ఇంట్లో దూరుతాయి. చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ఇల్లు బల్లిని ఆహ్వానిస్తుంది. కాబట్టి బల్లులు రావద్దంటే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
5. నెమలి ఈకలు
వినడానికి వింతగా ఉన్నా నెమలి ఈకలంటే బల్లులకు భయమట. కాబట్టి బల్లులు తిరిగే చోట నెమలి ఈకలను వేలాడదీస్తే అవి పత్తాలేకుండా పారిపోతాయట.
పెప్పర్ స్ప్రే మంటను కూడా బల్లులు తట్టుకోలేవట. కాబట్టి పెప్పర్ స్ప్రేను చల్లడం ద్వారా బల్లుల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
కాఫీ, తంబాకు మిక్సింగ్ వాసన కూడా బల్లులకు పడదు. కాబట్టి వాటి మిశ్రమం వాసన చూపిస్తే బల్లులు పారిపోతాయట.
ఆపిల్ సైడర్ వెనిగర్ వాసన కూడా బల్లులకు పడదు. కాబట్టి ఆపిల్ సైడర్ వెనిగర్‌ను స్ప్రే చేస్తే బల్లులు పరారవుతాయి.