సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత ధనిక పట్టణాభివృద్ధి సంస్థగా, ప్రభుత్వ ప్రాజెక్టులకు కామధేనువులా నిలిచిన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ సంస్థ ప్రతిష్ట దిగజారిపోయింది. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో చేతిలో చివ్వ గవ్వ లేక వేల కోట్ల ప్రాజెక్టుల భవితను ఆగమ్యగోచరంగా మార్చివేసింది. చేపట్టిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితం అవుతుండటం, దేశీయ బ్యాంకింగ్ సంస్థలు ముఖం చాటేయడాన్ని గమనించిన హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్.. యంత్రాంగాన్ని విదేశీ బాట పట్టించారు. ఖండాంతరాలు దాటి నిధుల కోసం కసరత్తు చేస్తున్నారు.
గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలు, రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వీర్యం చేసేలా చేపట్టిన విధానాలతో మున్సిపల్ శాఖపై ప్రభుత్వం పట్టు కోల్పోయింది. ఇక స్వయంగా ముఖ్యమంత్రియే ఈ శాఖ మంత్రిగా వ్యవహరించినా.. చేపట్టిన ప్రాజెక్టులను పట్టాలెక్కించలేని దయనీయ పరిస్థితి. హెచ్ఎండీఏ పరిధిలో స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు అతిగతీ లేకుండా కాగితాలకే పరిమితం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నిధుల కొరత. గతంలో రియల్ ఎస్టేట్ రంగం మెరుగ్గా ఉన్న సమయంలో గత ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసింది. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి లేదు.
ప్రతిపాదనలు రూపొందించడం, ఒక్క అడుగు ముందుకేసి టెండర్లు ఖరారు చేయడం వరకే నడుస్తోంది. మిగిలిన దంతా ప్రాజెక్టులు చేపట్టేందుకు నిధుల్లేక కాలయాపన చేయాల్సిందే.రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిని, గ్యారంటీలు, ఆదాయ వనరులపై పూర్తి అవగాహన ఉండటంతో దేశీయ బ్యాంకులన్నీ నిధులు సమకూర్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా పేరిట నగరంలో జరిగిన విధ్వంసం దాని పర్యవసానాలు రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలో ఇలాంటి సంస్థలకు నిధులు మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది.
ఇదే హెచ్ఎండీఏ అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతున్నది. దీంతో దేశీయ బ్యాంకులన్నీ చేతులు ఎత్తివేయడం, ఆర్బీఐ పెడుతున్న కొర్రీలు కూడా అప్పు పుట్టడం లేదనే తెలుస్తోంది. ఈ క్రమంలోవిదేశీ రుణాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సర్కారు.. తక్కువ వడ్డీ పేరిట ఖండాంతరాలు దాటి నిధుల కోసం పర్యటించాల్సి వస్తున్నది. నగర అభివృద్ధిని నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ విధి విధానాలు వేల ప్రాజెక్టుల భవితను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ముఖ్యంగా హెచ్ఎండీఏ ప్రతిపాదించిన దాదాపు 25 వేల కోట్ల ప్రాజెక్టులకు నిధులను సమకూర్చలేక, కాగితాల్లో మూలుగుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్లు, అవుటర్ రింగు రోడ్డు నుంచి ట్రిపులార్ను అనుసంధానం చేస్తూ చేపట్టే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, మూసీ వంటి ప్రాజెక్టులు ఇలా వేలాది కోట్లు విలువ చేసే ప్రతిపాదనలు కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిలో కొన్నింటికి టెండర్లు ప్రక్రియ ముగిసినా, వాస్తవ పరిస్థితిలో నిధుల కొరత లేకుండా పురోగతి లేక విలపిస్తున్నాయి. అయితే సర్కారు చేతిలో వేల కోట్ల ప్రాజెక్టులు ఉంటే… చేతిలో చిల్లి గవ్వ లేకుండానే ప్రతిపాదనలతో ఊరిస్తున్న కాంగ్రెస్ సర్కారు… అభివృద్ధిలో వెనకపడేలా చేసింది.
దేశీయ బ్యాంకుల నుంచి వచ్చిన విముఖతో ఇప్పుడు కమిషనర్ సర్ఫరాజ్ మార్గదర్శనంలో చైనాలో పర్యటిస్తున్న హెచ్ఎండీఏ బృందం… ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, చైనా డెవలప్మెంట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో చైనా బ్యాంకుల నుంచి రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు కేంద్రం పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో చైనాలో పర్యటిస్తున్న హెచ్ఎండీఏ బృందానికి అక్కడ నిధులు ఇచ్చేందుకు మొగ్గుచూపినా.. కేంద్రం నుంచి వచ్చే అనుమతులు అత్యంత కీలకమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.