కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్: ఒక కప్పు, బ్రెడ్‌ముక్కలు: రెండు, గుడ్లు: రెండు, కార్న్‌ఫ్లోర్: అర కప్పు, బ్రెడ్ క్రంబ్స్: అర కప్పు, జీలకర్ర పొడి: పావు టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, పసుపు: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
బ్రెడ్ ముక్కల అంచులు కత్తిరించి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో బ్రెడ్‌ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే చికెన్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేసుకోవాలి. చికెన్ మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసి పొడవుగా లేదా గుండ్రగా టిక్కీల్లా చేసుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లు వేసుకుని గిలకొట్టాలి. మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్, ఇంకో గిన్నెలో బ్రెడ్‌క్రంబ్స్ వేసుకోవాలి. చేసి పెట్టుకున్న టిక్కీలను గుడ్డు మిశ్రమంలో ముంచి కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి మళ్లీ గుడ్డు మిశ్రమంలో ముంచి బ్రెడ్‌క్రంబ్స్‌లో దొర్లించి కాగిన నూనెలో దోరగా
కాల్చుకుంటే వేడివేడి చికెన్ నగెట్స్ సిద్ధం.