ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో సహా రాజధాని ఒట్టావాలోని అధికారిక నివాసం వదిలి రహస్య ప్రాంతంలో తలదాచుకోవడానికి వెళ్లారు. కొవిడ్-19 వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా పలు సంఘాలు ఒట్టావాలోని పార్లమెంట్ హిల్ ప్రాంతంలో నిరసనలను ఉద్ధృతం చేశాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో భద్రతాదళాలు ట్రూడోను వేరే ప్రాంతానికి తరలించినట్టు మీడియా వర్గాలు చెబుతున్నాయి. కెనడా, అమెరికా సరిహద్దు దాటే ట్రక్కు డ్రైవర్లు కచ్చితంగా టీకా రెండు డోసులు వేసుకోవాల్సిందేనని, లేకపోతే దేశంలోకి అనుమతించబోమని ట్రూడో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశంలోని పౌరులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లతో పాటు మరికొన్ని వర్గాలు రాజధానిలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి.