న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్.. దేశీ ఫార్మా, హెల్త్‌కేర్ రంగంలో అతిపెద్ద లావాదేవీకి సిద్దమయ్యింది. అమెరికా ఫార్మా సంస్థ వయాట్రిస్‌కు చెందిన బయోసిమిలర్స్ వ్యాపారాన్ని 3.33 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.24,990 కోట్లు) కొనుగోలు చేయనున్నట్టు బయోకాన్ సోమవారం ప్రకటించింది. వయాట్రిస్ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని కొనేందుకు తమ సబ్సిడరీ బయోకాన్ బయోలాజిక్స్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు బయోకాన్ తెలిపింది. ఈ డీల్ ప్రకారం 2.335 బిలియన్ డాలర్ల నగదు, 1 బిలియన్ డాలర్ల విలువైన బయోకాన్ బయోలాజిక్స్ జారీచేసే కంపల్సరీ కన్వర్ట్‌బుల్ ప్రిఫరెన్స్ షేర్లు (సీసీపీఎస్) వయాట్రిస్‌కు అందుతాయన్నది. డీల్‌కు రెండు కంపెనీల బోర్డులు అంగీకారం తెలిపాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో కొనుగోలు లావాదేవీ పూర్తవుతుంది.
వయాట్రిస్ గ్లోబల్ బయోసిమిలర్స్ వ్యాపారం టర్నోవర్ వచ్చే ఏడాది 1 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నామని, ఈ వ్యాపారంతో పాటు ఆ సంస్థకున్న లైసెన్స్డ్ బయోసిమిలర్స్ ఆస్తులు బయోకాన్ చేతికి వస్తాయని తెలిపింది. ఈ టేకోవర్‌తో సమగ్ర అంతర్జాతీయ స్థాయి బయోసిమిలర్స్ సంస్థగా బయోకాన్ బయోసిమిలర్స్ ఆవిర్భవిస్తుందని, అమెరికా, యూరప్‌లలో వాణిజ్యాన్ని పెంపొందిస్తామని, బయోకాన్ పటిష్ఠమైన ప్రపంచ బ్రాండ్‌గా ఎదుగుతుందని బయోకాన్ బయోలాజిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చెప్పారు.