Bandla Ganesh | ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. ఇప్పుడు మరోసారి సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతగా పవర్ఫుల్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా అక్కినేని నాగచైతన్యను కలిసిన బండ్ల గణేష్.. తనదైన శైలిలో సినిమా అవకాశం ఇవ్వాలని అడిగారు. దీనికి చైతూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా బండ్ల గణేష్ పేరు చెప్పగానే పవన్ కల్యాణ్‌తో ఆయనకు ఉన్న అనుబంధంతో పాటు.. నిర్మాతగా ఆయన అందించిన విజయవంతమైన సినిమాలు గుర్తుకొస్తాయి. నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారి వరుసగా భారీ చిత్రాలను నిర్మించారు.
‘తీన్మార్’, ‘గబ్బర్ సింగ్’, ‘బాద్షా’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘టెంపర్’ వంటి సినిమాలను నిర్మించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ భారీ విజయాన్ని అందుకోవడంతో బండ్ల గణేష్ పేరు నిర్మాతగా మరింత బలంగా వినిపించింది.అయితే కొంతకాలంగా ఆయన నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నారు. సినిమాలకు దూరమైనా.. తన మాటతీరుతో, స్టేజ్ స్పీచ్‌లతో, ఇంటర్వ్యూలతో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల బండ్ల గణేష్ మరోసారి నిర్మాతగా సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించారు. మంచి కథ, సరైన హీరో, మంచి టీమ్ దొరికితే గతంలో మాదిరిగానే బ్లాక్‌బస్టర్ సినిమా అందించాలనే ఉత్సాహంతో ఉన్నట్లు ఆయన మాటల్లో కనిపించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా నాగచైతన్యను కలవడం ఆసక్తికరంగా మారింది. చైతూతో జరిగిన సంభాషణలో బండ్ల గణేష్ తనదైన స్టైల్లో సినిమా అవకాశం అడిగారు. నాగచైతన్యతో మాట్లాడుతూ.. ‘‘ఒక్క సినిమా ఇవ్వు బాబు.. బ్లాక్‌బస్టర్ తీస్తా’’ అంటూ బండ్ల గణేష్ అడిగారు. దీంతో అక్కడున్న వారంతా ఆసక్తిగా ఆ సంభాషణను గమనించారు.అయితే బండ్ల గణేష్ మాటలకు నాగచైతన్య ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తిని కలిగించింది. తాను ఎప్పుడో బండ్ల గణేష్‌కు ఓకే చెప్పానని చైతూ చెప్పారు. అంతేకాదు.. దర్శకుడి విషయంలో కూడా బండ్ల గణేష్ ఎవరిని ఎంపిక చేస్తే వారితోనే సినిమా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాననే అర్థంలో స్పందించారు. దీంతో వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బండ్ల గణేష్ నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో నాగచైతన్యతో సినిమా ఉంటుందా? అనే చర్చ మొదలైంది.