వన్డేల్లో ఐదుసార్లు ప్రపంచకప్ నెగ్గిన ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్లో తొలి టైటిల్ పట్టేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నది. చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బౌలింగ్‌లో హజిల్‌వుడ్ విజృంభిస్తే.. బ్యాటింగ్‌లో కరీబియన్లపై విరుచుకుపడ్డ డేవిడ్ వార్నర్ కంగారూలకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు!
అబుదాబి: విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టడంతో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు ఇది నాలుగో గెలుపు కాగా.. 8 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచిన కంగారూలు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ముందడుగేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (44) రాణించగా.. లూయిస్ (29), హెట్‌మైర్ (27) ఫర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్‌రౌండర్ డ్వైన్ బ్రావో (10) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. విండీస్ తరఫున చివరి మ్యాచ్ ఆడేసినట్లు కనిపించిన ‘యూనివర్సల్ బాస్’క్రిస్ గేల్ (15)కు సహచరుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించడం గమనార్హం. ఆసీస్ బౌలర్లలో హజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కెప్టెన్ ఫించ్ (9) విఫలమైనా.. మిషెల్ మార్ష్ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ వార్నర్ విజృంభించడంతో ఆసీస్ పని సులువైంది.
డిఫెండింగ్ చాంపియన్‌గా ప్రపంచకప్‌లో అడుగుపెట్టి కనీస ప్రభావం చూపలేకపోయిన వెస్టిండీస్ తమ ఆఖరి పోరులోనూ పరాజయం వైపు నిలిచింది. పొట్టి ఫార్మాట్లో ప్రపంచం మెచ్చే ఆటగాళ్లు ఉన్నా.. వారంతా జట్టుగా కలిసి ఆడటంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. రెండు సిక్సర్లు కొట్టి మంచి జోష్‌లో కనిపించిన క్రిస్ గేల్ తొలి వికెట్ రూపంలో డగౌట్ బాట పట్టగా.. పూరన్ (4), చేజ్ (0) అతడిని అనుసరించారు. పొలార్డ్ కాస్త పోరాడటంతో ఆ మాత్రం స్కోరు చేసిన కరీబియన్లు.. బౌలింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
సెమీస్ చేరాలంటే విండీస్‌పై విజయంతో పాటు.. రన్‌రేట్ మెరుగుపర్చుకోవాల్సిన స్థితిలో ఆసీస్ ఆటగాళ్లు ఆరంభం నుంచే దంచుడు మొదలెట్టారు. ఓపెనర్ వార్నర్ మునుపటి జోరు కనబరిస్తే.. మిషెల్ మార్ష్ భారీ షాట్లతో కరీబియన్ల పై యుద్ధం ప్రకటించాడు. హోల్డర్ వేసిన మూడో ఓవర్లో 4,4,6 కొట్టిన వార్నర్.. హుసేన్‌కు 6,4 రుచి చూపించాడు. ఫించ్ త్వరగానే ఔట్ కావడంతో క్రీజులో అడుగుపెట్టిన మార్ష్.. డేవిడ్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి ధాటికి విండీస్ బౌలర్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. రస్సెల్ ఓవర్లో మార్ష్ 6,4,4 అరుసుకుంటే.. మరో ఎండ్‌లో భారీ సిక్సర్‌తో వార్నర్ 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 98/1తో నిలిచింది. ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన జోడీ.. భారీ షాట్లతో విరుచుకుపడింది. ఫలితంగా మరో 23 బంతులు మిగిలుండగానే ఆసీస్ విజయ తీరాలకు చేరింది. తన విభిన్నమైన బౌలింగ్ యాక్షన్‌తో క్రిస్ గేల్ ఓ వికెట్ పడగొట్టడం కొసమెరుపు.
వెస్టిండీస్: 20 ఓవర్లలో 157/7 (పొలార్డ్ 44; హజిల్‌వుడ్ 4/39),
ఆస్ట్రేలియా: 16.2 ఓవర్లలో 161/2 (వార్నర్ 89 నాటౌట్, మార్ష్ 53; గేల్ 1/7).