సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): విద్యుత్ సంస్థ ఆర్థిక లావాదేవీలు, సాంకేతిక అవసరాలకు సంబంధించిన పాస్వర్డ్లు తాత్కాలిక ఉద్యోగుల చేతుల్లోకి వెళ్తున్నాయా? అంటే ప్రస్తుతం టీజీఎస్పీడీసీఎల్లో వెలుగు చూస్తున్న పలు అంశాలు అవుననే చెబుతున్నాయి. ఇటీవల నగర శివారులోని ఓ సర్కిల్లో ఏడీఈ పాస్‌వర్డ్‌ను స్థానికంగా పనిచేసే ఆర్టిజన్ వాడారు. దీనిపై పక్కా ఆధారాలను డిస్కం ఉన్నతాధికారులు సేకరించారు. అంతేకాకుండా నగరంలోని సెంట్రల్ ప్రాంతంలో ఉండే ఓ ఇంజినీర్ పాస్‌వర్డ్‌ను కూడా ఆర్టిజన్ వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మేడ్చల్ జోన్లో చాలా సెక్షన్లలో ఆర్టిజన్లే స్థానిక ఇంజినీర్ల పాస్వర్డ్లు వాడుతూ పనులు చేస్తున్నారని చర్చ జరుగుతున్నది.
తాము లేని సమయంలో పనులు జరగాలంటే ఎవరో ఒకరికి పాస్వర్డ్ తెలియాలి కాబట్టి అది ఆర్టిజన్‌కు ఇస్తున్నామని వారు చాలా తేలికగా చెప్పారు. కానీ టీజీఎస్పీడీసీఎల్ సంస్థకు సంబంధించిన పలు లావాదేవీలు శాప్ ద్వారానే జరుగుతాయి. వీటిని కంపెనీకి చెందిన ఉద్యోగులు అందులోనూ ఆయా సెక్షన్లలో కీలకమైన వారే ఉపయోగించాల్సింది పోయి కొందరు అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా శాప్ వ్యవస్థ దుర్వినియోగం అవుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు అధికారులు తమ వద్ద పనిచేసే ఆర్టిజన్లకు శాప్ యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు ఇస్తున్నారు. ఇది పలు సందర్భాల్లో సీఎండీ జితేష్ పాటిల్ వరకు చేరినప్పటికీ ఆయన మందలించి వదిలేశారు తప్ప సీరియస్‌గా చర్యలు తీసుకోకపోవడంతో ఒకట్రెండు రోజులు మానేసి తిరిగి యథాప్రకారం తమ పని తాము చేసుకుపోతున్నారని ఓ సీనియర్ విద్యుత్ ఇంజినీర్ చెప్పారు.
అధికారులు వినియోగదారుల విద్యుత్ అవసరాలను అంచనా వేసే క్రమంలో ప్రధానంగా ఉపయోగించేది శాప్ కాగా ఈ పాస్‌వర్డ్‌లను వేరేవారికి ఇవ్వడంతో డిస్కంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఆర్టిజన్ల ప్రమేయాన్ని ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపించినా సదరు ఆర్టిజన్లపై ఇంతవరకు చర్యలు లేవు. నగర శివారులో పెద్ద ఎత్తున జరిగిన దందాలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు డిస్కంలో చెప్పుకుంటుండగా ఈ మొత్తం లావాదేవీలకు ఇద్దరు ఆర్టిజన్లు కీలకమని చర్చ జరుగుతోంది.
అయితే ఆ ఇద్దరే కాకుండా కీసర, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పలు లావాదేవీలు కూడా ఆర్జిజన్లు నిర్వహిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ ఆర్టిజన్లతో స్థానిక ఇంజినీర్లు కుమ్ముక్కై తమ పనులను కూడా వారే చక్కబెట్టేలా చేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం రచ్చకెక్కింది. డిస్కం ఉన్నతాధికారుల దృష్టికి ఈ వివరాలు చేరినప్పటికీ వారు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు కారణం సదరు అధికారులతోపాటు ఇద్దరు డైరెక్టర్లకు కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉందనే చర్చ జరుగుతోంది. ఇటీవల నగర శివారులోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ స్వయంగా సీఎండీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఆర్టిజన్లపై ఆయన చర్య తీసుకోకపోవడం వెనక ఆంతర్యమేంటనే ప్రశ్న తలెత్తుతోంది.
అంతేకాకుండా విజిలెన్స్ విచారణలో లోపాయికారి ఒప్పందాలు జరిగాయని, సంస్థాగతంగా విచారణ చేపట్టాల్సిన చోట కేవలం విజిలెన్స్ విచారణనే ప్రామాణికంగా తీసుకోవడం వెనుక అర్ధమేంటంటూ డిస్కంలోని కొందరు ఇంజినీర్లు గుసగుసలాడుకుంటున్నారు. కొందరు ఆర్టిజన్లు నగరంలోని పలు సెక్షన్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా, వారు పనిచేయాల్సిన చోటు వదిలేసి కీలక ప్రాంతాల్లో అధికారాలు వెలగబెడ్తున్నా అడిగేవారే లేరని, వాటాలు ముట్టిన తర్వాత అడిగేది ఎవరని మింట్‌కాంపౌండ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు ఇచ్చి, ఆర్టిజన్లను మధ్యలో పెట్టి లక్షలకు లక్షలు సంపాదిస్తున్న అధికారులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యుత్ శాఖలో ఒక పని చేపట్టాలంటే ముందస్తుగా సాంకేతిక అంచనాలు, మెటీరియల్ అవసరాలు, ఖర్చు వివరాలు అన్నీ శాప్‌లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియలో అంచనా మొదలు పరిశీలించిన వారు, ఆమోదించిన వారెవరనే వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. అయితే ఏడీఈల స్థాయిలో యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు ఇస్తుండడంతో మొత్తం వ్యవస్థకే నష్టం జరిగే ప్రమాదముంది. శాప్‌లో నిర్దిష్ట అధికారాలున్న వారే సంబంధిత ఎంట్రీలు చేయాలి. కానీ కొన్ని సర్కిళ్లలో తమ వద్ద పనిచేస్తున్న ఆర్టిజన్లతో శాప్‌లో అంచనాలు, ఇతర ప్రక్రియలు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శాప్‌లో నమోదవుతున్న లావాదేవీలపై స్పష్టత రావాలంటే అందుకు అంచనాలను ఎంట్రీ చేసిన దగ్గర నుంచి పరిశీలించి ఆమోదించే వరకు ఏయే అధికారి పనిచేశారనే అంశాలు తెలియాలి. విద్యుత్ పనుల ఎస్టిమేషన్లు కంప్యూటర్లో నమోదు చేయడమే అనుకుంటే పొరపాటే, పనికి అవసరమైన మెటీరియల్, దాని ధర, క్వాంటిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎస్టిమేషన్ వేయాలి.
ఈ బాధ్యత ఇంజినీర్లది కాగా వారు మాత్రం ఈ పనిని ఆర్టిజన్లకు అప్పగిస్తుండడం, శాప్ పాస్వర్డ్లు ఇచ్చి టెక్నికల్ సాంక్షన్స్ వరకు మొత్తం పనులు చేయిస్తుండడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో మేడ్చల్, రంగారెడ్డి జోన్లలోని పలు సర్కిళ్లల్లో సెక్షన్ల వారీగా ఆర్టిజన్లు చెప్పిందే నడుస్తుంది. వారు చెప్పిన రేటుకు ఓకే అయితేనే మొత్తం పని ముందుకు కదులుతుందని కొందరు కాంట్రాక్టర్లు చెప్పారు. మేడ్చల్ జోన్లో కొందరు ఆర్టిజన్లు, ఇంజినీర్ల కుమ్ముక్కు వ్యవహారాలపై చర్యలెందుకు తీసుకోవడం లేదని పలువురు వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఒక పనికి వేయాల్సిన దానికంటే ఎక్కువగా అంచనాలు పెంచి, వాటిని తగ్గించడానికి ఓ రేటు మాట్లాడుకుని రూ.లక్షల లావాదేవీలు కొనసాగిస్తున్నారని కొందరు ఇంజినీర్లు, ఆర్టిజన్లపై ఆరోపణలు ఉన్నాయి.