Lucas Trejo : వెనెజువెలా (Venezuela) లో ఇటీవల సంభవించిన జంట భూకంపాలు (Earthquakes) ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ విపత్తులో అర్జెంటీనా ఫుట్‌బాలర్ (Argentina foot baller) లుకాస్ ట్రెజో (Lucas Trejo) తన కుటుంబాన్ని కోల్పోయారు. భవనం కూలిపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలు శిథిలాల కింద నలిగిపోయారు. వారి మరణాన్ని ఫుట్‌బాల్ క్లబ్ ‘డిపోర్టివో లా గువేరా’ ధ్రువీకరించింది.
ఈ భూకంపం ధాటికి వెనెజువెలాలోని యారకూ ప్రాంతం అతలాకుతలమైంది. అక్కడి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. లుకాస్ కుటుంబం ఉన్న భవనం కూడా కూలడంతో అతడి భార్య యానినా మారనెల్లా, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వారిని గుర్తించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆ ముగ్గురు శిథిలాల కింద ప్రాణాలు విడిచారు. అప్పుడు ఫుట్‌బాలర్ తన టీమ్‌తో వేరే ప్రాంతంలో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
భూకంపం తర్వాత తన భార్య, పిల్లలు గల్లంతయ్యారన్న వార్త వినగానే షాక్‌కు గురైన లుకాస్.. అక్కడకు చేరుకొని తన కుటుంబం కోసం శిథిలాలను తొలగిస్తూ వెతకడం ప్రారంభించాడు. వారిని ఎలాగైనా ప్రాణాలతో గుర్తించాలని అతడు చేసిన ప్రయత్నం తోటివారిని కంటతడి పెట్టించింది. ఇదిలావుంటే భూకంపం ధాటికి అతలాకుతలమైన వెనెజువెలాకు బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్ ఆపన్న హస్తం అందించాడు.
ఏకంగా 2,50,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2.35 కోట్లు) విరాళంగా ప్రకటించాడు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్యసహాయం అందించేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ జంట భూకంపాలవల్ల 60 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. ఇప్పటివరకు 1400 పైగా మృతదేహాలను గుర్తించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. గల్లంతయినవారి సంఖ్య వేలల్లోనే ఉందని ఐరాస అంచనా వేసింది.
వారిని ప్రాణాలతో రక్షించేందుకు తొలి 72 గంటలే కీలకం. ఇప్పటికే ఆ సమయం కూడా గడిచిపోవడంతో తమ వారి కోసం ఎదురుచూస్తోన్న కుటుంబాల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ముఖ్యంగా తీరప్రాంతం కలిగిన లా గువేరా మరుభూమిని తలపించింది. ‘హోటల్ ఎడ్వర్డ్’ పేకమేడలా కూలి గుర్తుపట్టలేని విధంగా ధ్వంసమైంది. అందులో బసచేసిన పలువురు స్టార్ ఆటగాళ్ల కుటుంబాలు శిథిలాల కింద చిక్కకున్నాయని వార్తలు వచ్చాయి.
మరోవైపు తన భార్య ప్రాణాలు కోల్పోయిందని వెనెజువెలా ఫుట్‌బాల్ ఆటగాడు హెక్టర్ బెల్లో పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వైరల్ అయ్యింది. ఏడాది వయసున్న కుమార్తెను కాపాడి ఆమె ప్రాణాలు విడిచింది.