వాషింగ్టన్, ఏప్రిల్ 7: గ్రహాంతరవాసుల (ఏలియన్స్) ఉనికిపై ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ, వాటిని తాము చూశామని పలువురు పేర్కొనడం తెలిసిందే. తాజాగా ఏలియన్ కారణంగా ఓ మహిళ గర్భందాల్చినట్టు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ డాక్యుమెంట్లో తెలిపింది.
ఓ వ్యక్తి వేసిన సమాచార హక్కు పిటిషన్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ప్రఖ్యాత వార్తాసంస్థ ‘ది సన్’ వెల్లడించింది. అలాగే, ఏలియన్స్‌ను, వాళ్లు ప్రయాణించే ఎగిరే పళ్లాలను (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్-యూఎఫ్‌వో) చూసిన వారిలో జట్టు రాలడం, తలనొప్పి, జ్వరం, పీడకలలు, ముక్కులో నుంచి రక్తం కారడం, చర్మంపై కాలిన గాయాలు, గుండెదడ వంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ కథనంపై అమెరికా అధికారులు ఇంకా స్పందించలేదు.