హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రావల్కోల్ గ్రామ పరిధిలో జరిగిన 275 ఎకరాల భూ దందా మరో మలుపు తీసుకుంది. దీని వెనుక సర్కార్ పెద్దల భారీ స్కెచ్ ఉందనేందుకు మరిన్ని ఆధారాలు బయటపడుతున్నాయి. గతంలో ఆరు నెలలపాటు కీసర ఆర్డీవోగా పనిచేసిన రాజేశ్‌కుమార్ దశాబ్దాలుగా పెండింగులో ఉన్న రావల్కోల్ భూముల ఫైల్‌ను కనీసం ముట్టుకోలేదు. కానీ ఈ ఏడాది జనవరి 8న అక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే సర్కార్‌కు దక్కాల్సిన రూ.5 వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం గమనార్హం. దీనివెనుక సర్కార్ పెద్దల ప్రమేయం ఉందంటూ ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 13న ‘భూ మంత్రుల్’ శీర్షికన కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన, ఇనామ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న ఆర్డీవోపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ పెద్దలే ప్రైవేట్ వ్యక్తులకు సర్కార్ భూమిని కట్టబెట్టారనేందుకు మరిన్ని ఆధారాలు బయటికొస్తున్నాయి.
సీసీఎల్ఏతోపాటు ఏజీ ద్వారా ఆర్డీవోకు లేఖలు పంపి వాటి ఆధారంగా ఫైల్‌ను వెంటనే డిస్పోజ్ చేయాలంటూ ప్రైవేట్ వ్యక్తులకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినట్టు స్ప ష్టమవుతుంది. అవగాహనలోపమో.. అసలు ప్రొసీడింగ్ డ్రాఫ్టు తాను రాయలేదో ఏమోగానీ.. ఇదే అంశాన్ని ఆర్డీవో తన ప్రొసీడింగ్‌లో స్వయంగా పేర్కొనడంతో అధికారికంగా ప్రభుత్వ ఒత్తిడిని బయటపెట్టారని రిటైర్డ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలను ఆర్డీవో తన ప్రొసీడింగ్‌లో అడ్డంగా ఇరికించారని, ఈ భూ దందాపై తదుపరి జరిగే న్యాయ విచారణల్లో ఇదే కీలకం కానుందని చెప్తున్నారు. దీంతోపాటు గతంలో జాయింట్ కలెక్టర్, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం ఆర్డీవో వక్రీకరించడమే కాకుండా ట్రిబ్యునల్ (ఖాసీ జ్యుడీషియల్) హోదాలో తీర్పు ఇవ్వాల్సిందిబోయి సాధారణ రెవెన్యూ అధికారి మాదిరిగా ప్రొసీడింగ్స్ ఇవ్వడంపై సీనియర్ అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
రావల్‌కోల్‌లోని సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లో ప్రభుత్వానికి చెందాల్సిన రూ.5 వేల కోట్ల విలువైన 275.12 ఎకరాల భూ వివాదంపై కీసర ఆర్డీవో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు ఓఆర్సీ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఆర్డీవో వాటిని అప్పనంగా అప్పగించడం వెనుక కచ్చితంగా సర్కార్‌లోని పెద్దలు ఉన్నారనేది బహిరంగ రహస్యం. అయితే ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 13న కథనాన్ని ప్రచురించిన తర్వాత ప్రభుత్వ పెద్దలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తాము పక్కాగా స్కెచ్ వేసి ఈ భూ దందాను ముగించామని ధీమా వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఆర్డీవో సొంతంగా నిర్ణయం తీసుకోకుండా పలు రకాలుగా సూచనలు స్వీకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకొనే విధంగా ప్రణాళిక రూపొందించామని వారు అంటున్నట్టు సమాచారం. అందులో భాగంగా సీసీఎల్ఏ నుంచి ఆర్డీవోకు లేఖ పంపినట్టు తేలింది. 1993 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ 275.12 ఎకరాల ఫైల్‌ను వెంటనే డిస్పోజ్ (పరిష్కరించాలి) చేయాలనేది ఆ లేఖ సారాంశం.
ముఖ్యంగా ఆ లేఖలో ఎక్కడా నిబంధనల మేరకు (డ్యూప్రొసీజర్) అని లేకపోవడం గమనార్హం. దానినే ఆర్డీవో తన ప్రొసీడింగ్‌లో రెఫరెన్స్-1 కింద ‘గవర్నమెంట్ మెమో’ అని పొందుపరచడంతో ప్రభుత్వ ప్రమేయం (తెర వెనుక సర్కార్ పెద్దలు) అధికారికంగా రుజువైతున్నది. సీసీఎల్ఏ నుంచి మే 26న లేఖ రాగానే ఆర్డీవో 27వ తేదీనే ప్రొసీడింగ్స్ ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉన్నదన్న వాదనకు మరింత బలం చేకూరుస్తుంది. వాస్తవానికి సీసీఎల్ఏ లేఖ రాసినపుడు సంబంధిత ఉన్నతాధికారులకు కూడా డిజిటల్ కాపీ వెళ్లాలి. కానీ ఈ విషయంలో.. సీసీఎల్ఏ రాసిన లేఖ నంబర్-2 మంత్రి పేషీ నుంచి నేరుగా ఆర్డీవోకు వెళ్లినట్టు తెలిసింది. కనీసం జిల్లా కలెక్టర్, జేసీ, డీఆర్వో వంటి ఉన్నతాధికారులకు కూడా ఈ కాపీ వెళ్లలేదంటే నంబర్-2 మంత్రి కార్యాలయం కేంద్రంగా ఆర్డీవోను కీలుబొమ్మగా మార్చి ప్రభుత్వ భూమిని పొతం చేసినట్టు తెలుస్తున్నది. దీంతోపాటు అడ్వకేట్ జనరల్ నుంచి కూడా ఈ 275 ఎకరాలకు సంబంధించి ఆర్డీవోకు లేఖ వెళ్లడం మరో కీలకాంశం. ఇక వెంటనే ఈ ఫైల్‌ను పరిష్కరించాలని పేర్కొనటం, సీసీఎల్ఏ, ఏజీ ప్రత్యేక చొరవ చూపడం.. తెరవెనుక సర్కార్ పెద్దలు ఉన్నారనేందుకు మరిన్ని ఆధారాలు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సీలింగ్, ఇనామ్ భూములకు సంబంధించిన ఫైల్స్ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల తెరపైకి వచ్చిన బాచుపల్లి గ్రామ పరిధిలోని సీలింగ్ భూముల అంశం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. రెవెన్యూ ఉన్నతాధికారులే ఒకవైపు హైకోర్టుకు స్వయంగా తాము 119 ఎకరాల భూమిని (అందులో సుమారు 27 ఎకరాలకు పైగా ప్రభుత్వానికి దక్కాల్సిన సర్ప్లస్ భూమి) సంరక్షిస్తున్నామని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆ భూములన్నింటిలోనూ నిర్మాణాలు వచ్చాయి. ప్రభుత్వానికి దక్కాల్సిన 27 ఎకరాలకు పైగా సర్ప్లస్ భూమి కూడా హారతికర్పూరం అయింది. కానీ నేటికీ ఆ ఫైల్‌ను మాత్రం అధికారులు పరిష్కరించడం లేదు. ఇలా మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనే అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ సీసీఎల్ఏ, ఏజీ మాత్రం కేవలం రావల్కోల్ భూములపైనే ‘వెంటనే ఫైల్‌ను పరిష్కరించండి’ అని ఎందుకు లేఖలు రాసినట్టు? అంటే దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయముందని అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా జోక్యం చేసుకోవడమంటేనే ‘తిలా పాపం.. తలాపిడికెడు’ సూత్రాన్ని అమలు చేశారన్నది స్పష్టమవుతున్నది. అయితే సీసీఎల్ఏ, ఏజీ లేఖలు ఇక్కడ ఫైల్ పరిష్కారానికి బలమవుతాయని సదరు పెద్దలు భావించారే తప్ప అవి స్వతంత్ర ట్రిబ్యునల్‌ను ప్రభావితం చేశాయనే లాజిక్‌ను విస్మరించారు.
రెవెన్యూ ఉన్నతాధికారులు తమ విధుల్లో భాగంగా నిర్వహించాల్సిన పాక్షిక న్యాయపరమైన విధులు (ఖాసీ జ్యుడీషియల్ పవర్స్)ను సక్రమంగా నిర్వహించడంలేదని, ఇందులో వాళ్లకు కచ్చితంగా ప్రభుత్వం శిక్షణ ఇవ్వాలని ఎనిమిది నెలల ముందే హైకోర్టు సూచించింది. ఒక కేసుకు సంబంధించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీచేసింది. వాళ్లకు పాక్షిక న్యాయపరమైన విధులపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించినా ఇప్పటివరకు అది అమలు కాలేదు. అంటే కీసర ఆర్డీవో తాజా కేసు విషయంలోనూ జస్టిస్ ఆందోళన ప్రస్ఫుటమవుతుందని, ఆ మేరకు శిక్షణ, పూర్తి అవగాహన లేకపోవడంతోనే సాధారణ ఆర్డీవో మాదిరిగా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గారని రిటైర్డ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రావల్కోల్ భూ దందాలో ఆర్డీవోకు ప్రత్యేకంగా ఇందుకోసమే పోస్టింగ్ ఇచ్చారనేందుకు మరో ఆధారం కూడా లభించింది. ఇదే రాజేశ్‌కుమార్ 2023, జూలైలో కీసర ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించారు. 2024, జనవరి వరకు అక్కడ విధులు నిర్వహించి, ఆపై ఇతర ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఈ ఆరు నెలల్లో ఆయన ఒక్కసారి కూడా ఈ ఫైల్‌ను పరిశీలించలేదు. సర్కార్ పెద్దలు కేవలం ఈ 275.12 ఎకరాలతోపాటు మరికొన్ని కార్యాలు చక్కబెట్టేందుకే ఆయనకు ఈ ఏడాది జనవరి 8న తిరిగి కీసరలో పోస్టింగ్ ఇచ్చారు. అందుకే ఆయన బాధ్యతలు తీసుకున్న వెంటనే 1993 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ఫైల్‌ను తీసి నాలుగవ రోజునే మొదటి హియరింగ్ చేపట్టారు.
ఆర్డీవో తీసుకున్న నిర్ణయంలో సీసీఎల్ఏ, ఏజీని కూడా భాగస్వాములను చేయడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకున్నామనే ధీమాలో సర్కార్ పెద్దలు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఇక్కడే వారు తప్పులో కాలేశారని రిటైర్డ్ అధికారులు చెప్తున్నారు. రాజేశ్‌కుమార్ ఆర్డీవో హోదాలో 275.12 ఎకరాలకు ఓఆర్సీ ఉత్తర్వులు ఇవ్వలేదని అంటున్నారు. ‘1955-ఇనామ్ రద్దు చట్టం ప్రకారం ఇనామ్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఆయన తన నిర్ణయాన్ని ఉత్తర్వుల రూపంలో ఇచ్చారు. పాక్షిక న్యాయపరమైన అధికారాలతో రాజేశ్‌కుమార్ జడ్జి హోదాలో తీర్పు ఇవ్వాలి. ఈ క్రమంలో ట్రిబ్యునల్ చైర్మన్ రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించాలి. కక్షిదారులకు నోటీసులు ఇవ్వాలి. నోటీసులు వారికి అందకపోతే రెండు దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. కక్షిదారుల వాదనలు, అభ్యర్థనలను సమగ్రంగా రాతపూర్వకంగా స్వీకరించి, వాటిని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. సంబంధిత తాసీల్దార్‌తో ప్రాథమిక నివేదిక తెప్పించుకొని, కక్షిదారులకు కూడా ఆ కాపీలను అందుబాటులో ఉంచాలి. చివరకు అన్ని సాక్ష్యాలను పరిగణనలోనికి తీసుకొని జడ్జి హోదాలో స్వతంత్రంగా తీర్పు రాయాలి. కానీ రావల్కోల్ విషయంలో కీసర ఆర్డీవో వీటన్నింటినీ ఉల్లంఘించినట్టు తెలుస్తున్నది’ అని రిటైర్డ్ అధికారులు పేర్కొంటున్నారు.