బెంగుళూరు: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO)ను ప్రైవేటీకరించడం లేదని ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ స్పష్టం చేశారు. అంతరిక్ష సంస్థ ప్రభుత్వం సంస్థగానే ఉంటుందని ఆయన వెల్లడించారు. భారతీయ అంతరిక్ష వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రైవేటు కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నట్లు ఆ సంస్థకు చెందిన 9 ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆగస్టు 4వ తేదీన లేఖ రాసిన నేపథ్యంలో ఆ అంశంపై చైర్మెన్ నారాయణన్ రియాక్ట్ అయ్యారు. మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషనల్ ఫంక్షన్స్‌కు ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
9వ బెంగుళూరు స్పేస్ ఎక్స్పోను ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ అంతరిక్ష సంస్థకు 65 ఏళ్లు నిండాయని, దేశ సాధారణ ప్రజలకు సేవలందించేందుకు అంతరిక్షంలో 56 భారత అసెట్స్ ఉన్నట్లు చెప్పారు. కానీ వాటి అవసరం ఇంకా ఎక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అంతరిక్ష రంగంలో ఆరేళ్ల క్రితం పెద్ద ఎత్తున ప్రక్షాళన మొదలైందని, దాని ప్రకారం ప్రైవేటు రంగం, స్టార్టప్ కంపెనీలతో కలిసి అంతరిక్ష వ్యవస్థను మరింత వృద్ధి చేయాలన్నారు. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగించినప్పుడు, 80 శాతం బడ్జెట్‌ను భారతీయ పరిశ్రమల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
సుమారు 450 కంపెనీలు ఇస్రో కోసం పనిచేస్తున్నట్లు నారాయణన్ చెప్పారు. ఇస్రో ఉద్యోగులు వ్యక్తం చేసిన ఆందోళన గురించి ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆందోళన వాస్తమైందే అని, దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. అంతరిక్ష ఆశయాలను సాధించేందుకు రాకెట్ ప్రయోగాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాది సుమారు 50 లాంచ్‌లు జరగాలని ఆయన తెలిపారు. ఈ అంశంలో మనం ముందుకు వెళ్లాల్సిన అసవరం ఉందన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించలేదని, ఓ ప్రభుత్వ సంస్థగానే ఉందన్నారు.
ఇస్రోలోనే మనం పనిచేస్తున్నామని, ఇది గవర్నమెంట్ పెట్టుబడి అని, కానీ మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయని, దేశంలో అంతరిక్ష వ్యవస్థ వృద్ధి కావాలని, స్పేస్ ఎకానమీ పెరగాల్సి ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇస్రోలో 43 ఏళ్ల క్రితం తాను చేరినప్పుడు మూడేళ్లకు ఓ లాంచ్ ఉండేదని, కానీ ఇప్పుడో వేగం పెరిగిందని, దాని ప్రకారమే ఏడాదికి 50 ప్రయోగాలు చేపట్టాల్సిన టార్గెట్ ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.
“Country’s requirement is 50 launch vehicles a year.
For this, the space ecosystem in the country has to grow.”
– ISRO Chairman V Narayanan pic.twitter.com/2uf7SRcvsp
— News Arena India (@NewsArenaIndia) September 7, 2026