రాంచీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సిఫారసు మేరకు గవర్నర్ రమేశ్ బాయిస్.. సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. తనకు తానే బొగ్గు గని కేటాయించుకున్నారని హేమంత్ సోరెన్‌పై అభియోగం ఉంది. సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దు అయిన నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. హేమంత్ భార్య కల్పన సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు షికారు చేస్తున్నాయి.
ఒడిశాలోని మయూర్ భంజ్‌కు చెందిన కల్పన.. వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ. ఆమె తల్లి గృహిణి కాగా, తండ్రి వ్యాపారి. 1976లో రాంచీలో కల్పన జన్మించారు. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రయివేటు పాఠశాలలోనే కొనసాగింది. రాంచీలోని ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 2006, ఫిబ్రవరి 7న హేమంత్ సోరెన్‌ను కల్పన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.
ప్రభుత్వ వేదికలపై ఆమె కనిపించడం చాలా తక్కువ. వ్యాపార రంగంలో రాణిస్తూనే ఓ ప్రయివేటు స్కూల్‌ను నడుపుతున్నారు. మహిళా సాధికారత, పిల్లల అభివృద్ది కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక పలు ఫంక్షన్లలో కల్పన తరుచుగా కనిపిస్తుంటారు. పొలిటికల్ కుటుంబానికి కోడలు అయినా కల్పన.. సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఒక వేళ కల్పన కుటుంబం రాజకీయాల్లో అవకాశం కల్పిస్తే రాణించగలుగుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు.
ఇక కల్పన వ్యాపారం కోసం సీఎం హేమంత్ సోరెన్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్లాట్ కేటాయించారని బీజేపీ నాయకుడు రఘుబర్ దాస్ ఆరోపణలు చేయడంతో ఆమె వార్తల్లోకి ఎక్కింది.
స్టోన్ చిప్స్ మైనింగ్ లీజును తన పేరున సొరేన్ పొందారంటూ గవర్నర్ రమేశ్ బాయిస్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సొరేన్ తనకోసం తానే ఒక లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పార్టీ నేత, మాజీ సీఎం రఘుబర్‌దాస్ ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 9ఏ ప్రకారం సొరేన్పై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని (ఈసీ) గవర్నర్ కోరారు. ఈ క్రమంలో గురువారం ఉదయం సీల్డ్ కవర్లో తన అభిప్రాయాన్ని ఈసీ.. రాజ్‌భవన్‌కు పంపించింగా, శుక్రవారం సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది.