Paratha : బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఏ వేళలో అయినా సరైన ఆహారంగా పరాటాలను మించి మరే ఆహారం ఫిట్ కాదు. తొందరగా లంచ్ ముగించాలంటే పరాటాలను సబ్జితో తీసుకుంటే సరిపోతుంది. ఇక బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చాలా మంది పరాటాలను లాగించి హాట్ ఛాయ్ ఆస్వాదిస్తుంటారు. అయితే మైదా, గోధుమ పిండి పలు రకాల స్టఫింగ్తో తయారయ్యే పరోటాను రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. అధికంగా నూనె, వెన్నతో తయారుచేసే పరాటాలను రోజూ తీసుకుంటే జీర్ణం కావడం కష్టమే.
అయితే ఈ పరాటాలను టేస్టీగా, ఆరోగ్యకరంగా మలుచుకోవాలంటే సరైన ప్రత్యామ్నాయాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పరాటాలో ఎక్కువగా సీజనల్ కూరగాయలను స్టఫ్ చేయడం మేలు. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను ఎక్కువగా జోడిస్తే జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు కార్బోహైడ్రేట్ కంటెంట్‌ను కూడా తగ్గించవచ్చు.
ఇక మైదా, గోధుమలకు బదులు పరాటా పిండిలో ఫైబర్ అధికంగా ఉండే రాగి, మొక్కజొన్న పిండిని వాడితే మేలు. పరాటాలను తయారుచేసేందుకు ఇనుప పాత్రల్లో వండటం ద్వారా పదార్ధంలో ఐరన్ కంటెంట్ పెరిగేలా చూసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్ సూచిస్తున్నారు. పరాటా తీసుకున్న కనీసం గంట తర్వాత టీ తాగాలని చెబుతున్నారు. పరాటా తిన్న వెంటనే టీ తాగితే పోషకాలు శరీరం సంగ్రహించడాన్ని అడ్డుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ రోజులో ఏ సమయంలోనైనా పరాటాలను ఎంజాయ్ చేయవచ్చు.
Read More :
Health Tips | రోజులో ఎన్నిసార్లు తినొచ్చు? ఎన్ని గంటల నిడివిలో తినాలి?