న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలిని హత్య చేసిన నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా.. పలు వెబ్‌సిరీస్‌లు చూసి ఆనవాళ్లను మాయం చేసినట్టు తేలింది. ఇంగ్లిష్ సీరియల్ కిల్లర్ వెబ్‌సిరీస్ ‘డెక్స్టర్’, ఇతర క్రైం సిరీస్‌లను చూసి, ఇంటర్నెట్లో చదివి ఆనవాళ్లను మాయం చేసినట్టు పోలీసుల విచారణలో ఆఫ్తాబ్ తెలిపాడు.
మే 18న ఇద్దరి మధ్య గొడవ జరిగాక, ఆమెపై కూర్చొని, చేతులను అదిమి పట్టి, గొంతు కోసి చంపాడు. క్రైం షోల్లో చూసినట్టు.. మృతదేహాన్ని నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరకడానికి గూగుల్‌లో సెర్చ్ చేసి మానవ శరీర నిర్మాణాన్ని చదివాడు. ఫ్రిజ్‌లో దాచిపెట్టిన శ్రద్ధా ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసేవాడు. తొందరగా పాడయ్యే శరీర అవయవాలను ముందుగా పారేసేవాడు. రక్తాన్ని ఎలా శుభ్రం చేయాలి? మానవ శరీర నిర్మాణం ఎలా ఉంటుంది? అన్న అంశాలను ఆఫ్తాబ్ చదివినట్టు గూగుల్ హిస్టరీలో బయటపడింది.
యువతిని చంపాక రక్తాన్ని శుభ్రం చేసేందుకు సల్ఫర్ హైపోక్లోరైట్‌ను వాడాడు. రక్తపు మరకలున్న బట్టలను చెత్త బండిలో పడేశాడు. అంతేకాదు.. శ్రద్ధను చంపిన 15 రోజుల్లోనే మరో యువతికి గాలం వేశాడు. శ్రద్ధాను కలిసిన డేటింగ్ యాప్‌లోనే ఆమెనూ కలిశాడు. ఆమె ఓ సైకాలజిస్టు. జూన్, జూలైలో పలుమార్లు ఆమె ఆఫ్తాబ్ అపార్ట్‌మెంట్‌కు కూడా వచ్చింది. ఆ సమయంలో శ్రద్ధ శరీర భాగాలను ఇంట్లోని కబోర్డులో దాచిపెట్టాడు. తన స్నేహితులు ఇంటికి వచ్చినా అనుమానం రాకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు.
శ్రద్ధ సోషల్ మీడియా ఖాతాల్లో లాగిన్
శ్రద్ధ బతికే ఉన్నదని నమ్మించేందుకు ఆఫ్తాబ్ చాలా కుయుక్తులు పన్నాడు. అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో లాగిన్ అయ్యేవాడు. ఆమె స్నేహితులకు మెసేజ్‌లు చేసేవాడు. ఆమె క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించేవాడు. అయితే, శ్రద్ధ ఫోన్ స్విచ్ఛాఫ్ రావటం, సోషల్ మీడియాలో అప్డేట్లు లేకపోవటంతో స్నేహితులకు అనుమానం వచ్చి తల్లిదండ్రులకు చెప్పారు.
అవును నేనే చంపా: ఆఫ్తాబ్
శ్రద్ధను తానే చంపానని ఆఫ్తాబ్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ‘అవును! నేనే చంపా’ అని ఇంగ్లిష్‌లో అన్నాడని, తనకు హిందీ అర్థం కాదని చెప్పాడని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని మెహ్రౌలీ జైల్లో ఉన్న నిందితుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని.. శరీర భాగాలు పడేసిన ప్రాంతాలకు తీసుకెళ్లి, వెతికారు. అతడి ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కానీ, హత్యకు వాడిన కత్తి, శ్రద్ధ ఫోన్ కోసం గాలిస్తున్నారు.