Amit shah | బెంగళూరు, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కుటుంబ, వారసత్వ రాజకీయాలకు కొత్త వ్యాఖ్యానం చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పుడు రేవ్డి కల్చర్‌కు (ఉచిత ప్రయోజనాలు) కొత్త నిర్వచనాన్ని ప్రవచించారు. వస్తు రూపేణా ప్రజలకు ఉచితంగా ఇచ్చేవేవీ రేవడి కాదన్నారు. కేవలం నగదును ప్రజల ఖాతాలోకి నేరుగా బదిలీ చేయటమే రేవడి సంస్కృతి అని సెలవిచ్చారు.
కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించిన ‘ఉచిత హామీలు’ విమర్శలకు గురి కావటంతో దాన్ని సమర్థించుకునేందకు అమిత్ షా రంగంలోకి దిగారు. ‘పేదలకు ఉచిత ఇండ్లు, మంచి నీటి సరఫరా, పాల ప్యాకెట్లు, ఆరోగ్య బీమా, ఆహార ధాన్యాల వితరణ ఏ మాత్రం ఉచితాలు కావు. ఇవి పేదల ఆరోగ్యాన్ని, జీవన స్థాయిని దీర్ఘ కాలంలో మెరుగు పరిచేందుకు ఉపయుక్తమయ్యేవి. రేవ్డీ కల్చర్ అంటే ప్రజల ఖాతాల్లోకి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని బదిలీ చేయటం’ అని మీడియా ప్రతినిధులతో ఆయన వ్యాఖ్యానించారు.